కొలీజియం రద్దుకు పిటిషన్‌.. లిస్టింగ్‌పై పరిశీలనకు సుప్రీం నిరాకరణ

ఉన్నత న్యాయవ్యవస్థలో జడ్జీల నియామకం కోసం అమలవుతున్న కొలీజియం విధానం రద్దుకు దాఖలైన పిటిషన్‌ను లిస్టింగ్‌ చేసే అంశాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. మాథ్యూస్‌ నెడుంపారా అనే న్యాయవాది దీన్ని దాఖలుచేశారు.

Updated : 30 Apr 2024 05:43 IST

దిల్లీ: ఉన్నత న్యాయవ్యవస్థలో జడ్జీల నియామకం కోసం అమలవుతున్న కొలీజియం విధానం రద్దుకు దాఖలైన పిటిషన్‌ను లిస్టింగ్‌ చేసే అంశాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. మాథ్యూస్‌ నెడుంపారా అనే న్యాయవాది దీన్ని దాఖలుచేశారు. తన పిటిషన్‌ను విచారణ కోసం లిస్ట్‌ చేయాలని ఆయన అభ్యర్థించారు. ‘‘నేను చాలాసార్లు దీన్ని ప్రస్తావించా. రిజిస్ట్రీ దీన్ని తిరస్కరించింది. నా పిటిషన్‌ను లిస్ట్‌ చేయడంలేదు’’ అని పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ స్పందిస్తూ.. ‘‘రాజ్యాంగ ధర్మాసనం ఒక అంశంపై రూలింగ్‌ ఇచ్చాక 32వ అధికరణం కింద పిటిషన్‌ వేయడం చెల్లదని రిజిస్ట్రార్‌ (లిస్టింగ్‌) స్పష్టంచేశారు. రిజిస్ట్రార్‌ ఉత్తర్వులపై ఉపశమనం పొందడానికి ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. కొలీజియం వ్యవస్థపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తులు ఛాంబర్లలో కొట్టేశారని న్యాయవాది తెలిపారు. ‘‘ఇది సుప్రీంకోర్టు విశ్వసనీయతకు సంబంధించింది. కొలీజియం వ్యవస్థ రద్దు కావాలి’’ అని కోరారు. ఈ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని