బీబీసీ డాక్యుమెంటరీపై విచారణ నుంచి వైదొలగిన దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి

అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్‌’ డాక్యుమెంటరీకి సంబంధించి ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ నుంచి దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అనూప్‌ జయరామ్‌ భంభానీ వైదొలిగారు.

Updated : 18 May 2024 05:51 IST

దిల్లీ: అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్‌’ డాక్యుమెంటరీకి సంబంధించి ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ నుంచి దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అనూప్‌ జయరామ్‌ భంభానీ వైదొలిగారు. ఇందుకు కారణం మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ డాక్యుమెంటరీలో దేశ ప్రతిష్ఠపై బీబీసీ దుష్ప్రచారం చేసిందని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భారత న్యాయ వ్యవస్థ పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసిందని గుజరాత్‌ కేంద్రంగా పనిచేసే స్వచ్ఛంద సంస్థ ‘జస్టిస్‌ ఆన్‌ ట్రయల్‌’ తన పిటిషన్‌లో పేర్కొంది. డాక్యుమెంటరీ గుజరాత్‌ అల్లర్లకు, భారత ప్రజలకు సంబంధించినది అయినందున, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భారత ప్రభుత్వం, గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించినందున రూ.10,000 కోట్లు పరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరింది. ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలకు లోబడి మే 22న వేరే ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌ను లిస్ట్‌ చేయనున్నట్లు హైకోర్టు తెలిపింది. మరోవైపు, బీబీసీ-యూకే, బీబీసీ-ఇండియాలకు ఈ పిటిషన్‌కు సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. 2002లో గుజరాత్‌ అల్లర్ల సమయంలో నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు చోటుచేసుకున్న ఘటనలతో రూపొందించిన ఈ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని