క్రిమిసంహారాల అతి వినియోగంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీస్‌

ఆహారోత్పత్తులపై క్రిమిసంహారాలను, రసాయనాలను అధికంగా వినియోస్తున్నందున దేశంలో మరణాల సంఖ్య పెరిగిపోతోందంటూ దాఖలైన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.

Updated : 18 May 2024 05:51 IST

దిల్లీ: ఆహారోత్పత్తులపై క్రిమిసంహారాలను, రసాయనాలను అధికంగా వినియోస్తున్నందున దేశంలో మరణాల సంఖ్య పెరిగిపోతోందంటూ దాఖలైన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. వ్యవసాయ మంత్రిత్వశాఖ, భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) తదితరులకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తాఖీదులిచ్చింది. పంటల సస్యరక్షణకు క్రిమిసంహారాలను అధిక మొత్తంలో వినియోగించడం దేశంలో సాధారణమైపోయిందని పిటిషనర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కలుపుమొక్కలు, పంటలకు వచ్చే వివిధ తెగుళ్లు, పురుగులు, ఎలుకల నివారణకు వినియోగిస్తున్న రసాయనాల అవశేషాల వల్ల ప్రజలు క్యాన్సర్లు తదితర ప్రమాదకరమైన వ్యాధుల బారినపడుతున్నారని తెలిపారు. రసాయనాల పిచికారీ వల్ల జల, వాయు కాలుష్య సమస్య కూడా తలెత్తుతోందన్నారు. ఆహారపదార్థాల కల్తీ, కలుషితం కారణంగా కూడా తీవ్ర నష్టం కలుగుతోందని వివరించారు. ప్రభుత్వ విభాగాలు కేసులు నమోదు చేసి కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడంలేదంటూ అధికారిక గణాంకాలను ఉటంకించారు. ప్రస్తుత నియంత్రణ చర్యలను సమూలంగా మార్చివేసి మరింత పకడ్బందీ నిబంధనలు రూపొందించి అమలు చేసేలా ఆదేశించాలని పిటిషనర్‌ విజ్ఞప్తి చేశారు. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర సభ్యులుగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు