జస్టిస్‌ బోపన్నకు ఘనంగా వీడ్కోలు

పదవీ విరమణ పొందుతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నకు సర్వోన్నత న్యాయస్థానం ఘనంగా వీడ్కోలు పలికింది. న్యాయం, సమయపాలన, ఔదార్యానికి ఆయన మారుపేరు అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ఈ సందర్భంగా కొనియాడారు.

Updated : 18 May 2024 05:52 IST

దిల్లీ: పదవీ విరమణ పొందుతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నకు సర్వోన్నత న్యాయస్థానం ఘనంగా వీడ్కోలు పలికింది. న్యాయం, సమయపాలన, ఔదార్యానికి ఆయన మారుపేరు అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ఈ సందర్భంగా కొనియాడారు. జస్టిస్‌ బోపన్న ఈ నెల 19న పదవీ విరమణ పొందుతున్నారు. వేసవి సెలవులకు ముందు న్యాయస్థానానికి చివరి పనిదినమైన శుక్రవారమే సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. సర్వోన్నత న్యాయస్థానంలో జస్టిస్‌ బోపన్న ఐదేళ్లపాటు న్యాయమూర్తిగా పనిచేశారని చెప్పారు. అనేక అంశాలపై 90కిపైగా తీర్పులను ఆయన రచించారని తెలిపారు. నిబద్ధత, చట్టబద్ధపాలనకు ఆయన ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. ‘‘జస్టిస్‌ బోపన్న.. రాహుల్‌ ద్రవిడ్‌ లాంటివారు. సుప్రీంకోర్టులో మాకు ఆయన ‘మిస్టర్‌ డిపెండబుల్‌’. ధర్మాసనంలో, వెలుపల ఆయనతో మాట్లాడుతున్నప్పుడు.. నిష్పాక్షికత, ఔదార్యం మధ్య ఆయన సమతూకం పాటిస్తున్న తీరు చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేవాడిని’’ అని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు జడ్జిగా తన కెరీర్‌ ఎంతో సంతృప్తినిచ్చిందని జస్టిస్‌ బోపన్న పేర్కొన్నారు. ‘‘ప్రతి ఇన్నింగ్స్‌ను సున్నా నుంచి మొదలుపెడతానని, సాధించినదానితో తృప్తి పడనని, మరో ఇన్నింగ్స్‌ నిర్మించుకోవడంపై దృష్టిపెడతానని క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌ ఓ సందర్భంలో పేర్కొన్నారు. అదే రీతిలో సుప్రీంకోర్టులో నాకు ప్రతిరోజూ కొత్తే. నిత్యం అనేక అనుభవాలను నేర్చుకున్నా’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి, అనేక మంది న్యాయవాదులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని