కేజ్రీవాల్‌ క్షమాపణ చెప్పాలి: నిర్మలా సీతారామన్‌

ఆప్‌ ఎంపీ స్వాతీమాలీవాల్‌పై దాడి ఘటన నేపథ్యంలో.. ఆ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మౌనం వహించడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ అన్నారు.

Published : 18 May 2024 05:54 IST

దిల్లీ: ఆప్‌ ఎంపీ స్వాతీమాలీవాల్‌పై దాడి ఘటన నేపథ్యంలో.. ఆ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మౌనం వహించడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ అన్నారు. మహిళా కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన ఆమెకు ఈ పరిస్థితి ఎదురుకావడం సిగ్గుచేటన్నారు. ‘‘తన నివాసంలోనే పార్టీ ఎంపీపై దాడి జరిగితే.. కేజ్రీవాల్‌ ఒక్క మాట మాట్లాడకపోవడం షాక్‌కు గురిచేస్తోంది. తగిన చర్యలు తీసుకోలేదు. దీనిపై ఆయన క్షమాపణలు చెప్పాలి. యూపీ పర్యటనలో ఆయన వెంట నిందితుడు ఉన్నాడని నాకు తెలిసింది. ఆమెకు ఎదురైన పరిస్థితి సిగ్గుచేటు. ఫిర్యాదు చేయడానికి రోజుల సమయం పట్టిందంటే.. ఆమెపై ఒత్తిడి ఉందని అనిపిస్తోంది’’ అని సీతారామన్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. 

ఆప్‌లో ఇలాంటి దాడులు సాధారణమే: షాజియా ఇల్మి

స్వాతి మాలీవాల్‌పై దాడి నేపథ్యంలో ఆప్‌ మాజీ నాయకురాలు షాజియా ఇల్మి సంచలన ఆరోపణలు చేశారు. గతంలో తనకూ ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లు చెప్పారు. ఆ పార్టీలో కొట్టడం సర్వసాధారణమని అన్నారు. ‘‘స్వాతిపై దాడి జరిగింది. కేజ్రీవాల్‌ చెప్పింది చేయడమే బిభవ్‌ పని. ఆ వ్యక్తి దురుసు ప్రవర్తనను నేనూ సహించాల్సి వచ్చింది. అక్కడ కొట్టడం మామూలే. ప్రశాంత్‌ కుమార్, యోగేంద్ర యాదవ్‌ లాంటి వాళ్లను బౌన్సర్లలతో గెంటేశారు. ఈసారి హద్దులు దాటారు. పీఏతో ఓ మహిళను కొట్టించడం తగినదేనా? ఇంత జరిగాక కేజ్రీవాల్‌ సీఎం పదవిలో కొనసాగడం సరికాదు. ఘటనకు బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పి పదవికి రాజీనామా చేయాలి’’ అని ఆమె డిమాండ్‌ చేశారు.

ఎన్‌సీడబ్ల్యూ ముందు హాజరుకాని బిభవ్‌ కుమార్‌

కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు, ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బిభవ్‌ కుమార్‌ శుక్రవారం జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) విచారణకు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనకు నోటీసులిచ్చేందుకు ఎన్‌సీడబ్ల్యూ బృందం పోలీసులతో కలిసి శుక్రవారం కుమార్‌ ఇంటికి వెళ్లినట్లు కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ వెల్లడించారు. అయితే ఆ ఇంట్లోని వ్యక్తులు నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారని, దీంతో ఆ ఇంటి ద్వారానికి నోటీసులు అతికించారని చెప్పారు. విచారణను శనివారం చేపడతామని ఆమె వివరించారు. 

ఆధారాలు సేకరించిన పోలీసులు 

మాలీవాల్‌పై దాడి కేసులో దిల్లీ పోలీసులు ఘటన చోటుచేసుకున్న కేజ్రీవాల్‌ నివాసానికి శుక్రవారం సాయంత్రం 4.45 గంటలకు వెళ్లారు. వారితో పాటు ఫోరెన్సిక్‌ సిబ్బంది కూడా ఉన్నారు.  దాడి ఘటనను పునఃసృష్టి చేసేందుకు స్వాతి మాలీవాల్‌ను కూడా తమ వెంట తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఇంట్లో ఉన్న ఎనిమిది సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. భద్రతా సిబ్బంది వాంగ్మూలాలను రికార్డు చేసుకున్నారు. మరో పోలీసు బృందం నిందితుడు బిభవ్‌ కుమార్‌ను విచారించేందుకు ఆయన ఇంటికి కూడా వెళ్లిందని ఓ అధికారి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని