పౌరుల స్వేచ్ఛ అంశంలో ప్రతి రోజూ విలువైందే: సుప్రీంకోర్టు

పౌరుల స్వేచ్ఛతో ముడిపడిన కేసుల్లో ప్రతి రోజూ విలువైందేనని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టంచేసింది.

Published : 18 May 2024 05:13 IST

దిల్లీ: పౌరుల స్వేచ్ఛతో ముడిపడిన కేసుల్లో ప్రతి రోజూ విలువైందేనని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టంచేసింది. దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో వ్యాపారవేత్త అమన్‌దీప్‌ సింగ్‌కు సాధారణ బెయిలు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోవాలని దిల్లీ హైకోర్టుకు సూచించింది. జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ సందీప్‌మెహతా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అమన్‌దీప్‌ సింగ్‌కు సాధారణ బెయిల్‌ ఇచ్చే అంశంపై దిల్లీ హైకోర్టు 40సార్లు విచారణ చేపట్టిందని, ఇప్పుడు ఆ అంశం జులై 8కి వాయిదా పడిందని ఆయన తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌.. సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించారు. 40సార్లు విచారణ చేపట్టినప్పటికీ నిర్ణయాన్ని వెలువరించలేదన్నారు. సాధారణ బెయిల్‌ కోసం ఈ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టులో గత ఏడాది జులైలో దాఖలు చేశారని తెలిపారు. ‘‘పౌరుల హక్కులతో ముడిపడిన కేసుల్లో ప్రతి రోజూ విలువైందే. రెగ్యులర్‌ బెయిల్‌ అంశాన్ని దాదాపు 11 నెలల పాటు పెండింగ్‌లో పెట్టడం పిటిషనర్‌ వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే. వేసవి సెలవుల ప్రారంభానికి ముందే ఈ బెయిల్‌ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హైకోర్టుకు సూచిస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు వేసవి సెలవులు వచ్చే నెల 3 నుంచి ప్రారంభమవుతాయి. మే 31న చివరి పనిదినం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని