ఆత్మవిశ్వాసంతో ఏం సాధించొచ్చు?

ఆత్మవిశ్వాసం ప్రతిసారీ మనల్ని విజయ తీరాలకు చేర్చలేకపోవచ్చు. అన్నింటినీ మనకు అనుకూలంగా మార్చకపోవచ్చు.

Updated : 18 May 2024 05:58 IST

ఆత్మవిశ్వాసం ప్రతిసారీ మనల్ని విజయ తీరాలకు చేర్చలేకపోవచ్చు. అన్నింటినీ మనకు అనుకూలంగా మార్చకపోవచ్చు. కానీ లక్ష్య సాధన మార్గంలో అనివార్యంగా ఎదురయ్యే వైఫల్యాలను అంగీకరించే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఆశతో ముందుకెళ్లే ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ రెండూ ఉంటే దేన్నైనా సాధించొచ్చు.

‘ఎక్స్‌’లో సుధామూర్తి, మూర్తి ట్రస్ట్‌ అధ్యక్షురాలు, రచయిత్రి


ప్రతి పనికీ ఫలితం తప్పదు 

సముపార్జన సూత్రం ప్రకారం.. మనం చేసేది ఎంత చిన్న పనైనా అది మన సమగ్ర పురోగతికి దోహదం చేస్తుంది. పుస్తకం చదవడం, విజ్ఞానాన్ని పెంచే వీడియోలు చూడటం, కొత్త కోర్సు పూర్తి చేయడం, త్వరగా నిద్రపోయి వేకువజామునే లేవడం.. ఇలాంటివన్నీ మనపై సకారాత్మక ప్రభావాన్ని చూపుతాయి. టీవీ చూస్తూ కాలక్షేపం చేయడం, వాదోపవాదాలతో సమయం వృథా చేయడం లాంటివి నకారాత్మక ప్రభావాన్ని చూపుతాయి. మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ బాటలో వెళ్లాలో మనమే నిర్ణయించుకోవాలి.

‘ఎక్స్‌’లో బ్రియాన్‌ ట్రేసీ, రచయిత


మీ పిల్లల్ని గమనిస్తున్నారా?

పిల్లలు రెండు రకాలు... వైఫల్యం ఎదురైనప్పుడు అది తమ వల్లే అని అంగీకరించేవారు. జీవితంలో వారు ఆనందంగా జీవించగలరు. విజయాలనూ సాధించగలరు. కానీ వైఫల్యానికి ఇతరులను నిందించే పిల్లలు భవిష్యత్తులోనూ అదే మనస్తత్వంతో ఉంటూ ఆనందానికి ఆమడ దూరంలో ఉండిపోతారు. ప్రాథమిక విద్య స్థాయిలోనే పిల్లల్లో ఈ లక్షణాలు బయటపడతాయి. అప్పుడే గుర్తించి సరిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అతి గారాబం పనికిరాదు.

‘ఎక్స్‌’లో ఎ.వేలుమణి, ‘థైరోకేర్‌ ’ సంస్థ వ్యవస్థాపకులు


అమ్మాయిలూ.. మీ భయమే వాడి బలం

అమ్మాయిలకు ఒకప్పుడు తెలిసినవారి నుంచే వేధింపులు ఎదురయ్యేవి. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో ముక్కూ మొహం తెలియని వారి నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సమాజంలో అయినా, ఆన్‌లైన్‌లో అయినా వేధించేవాడి ఆయుధం ఒక్కటే. అది మీ భయం. మీరు భయపడేకొద్దీ వాడి బలం మరింత పెరుగుతుంది. మానసిక హింస ఇంకా తీవ్రమవుతుంది. అదే ఒక్కసారి మీరు ధైర్యం కూడగట్టుకొని ఎదురు తిరగండి. భయంతో వాడి నోరు తడారిపోతుంది. తన గురించి ఎవ్వరికీ చెప్పొద్దంటూ వణుకుతున్న చేతులతో వేడుకుంటూ పారిపోతాడు.

‘ఎక్స్‌’లో దివ్యా మిత్తల్, ఐఏఎస్‌ అధికారిణి


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని