సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు

సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం:  గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది.

Updated : 19 May 2024 05:58 IST

సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం:  గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. సమయం: వ్యక్తిగత అభిరుచులు, కుటుంబ జీవితాన్ని ఆస్వాదించే అవకాశాన్ని కల్పించేది. ఆరోగ్యం: శారీరక, మానసిక ఉత్తేజాన్ని అందించేది. మనం చేసే వృత్తి ఈ నాలుగింటినీ అందిస్తేనే మనం ఆనందంగా జీవించగలం. చాలా ఉద్యోగాలు తొలి రెండింటిని ఆకర్షణీయంగా చూపుతూ ఊరిస్తాయి. కానీ చివరి రెండింటిని మన నుంచి దూరం చేస్తాయి. అలాంటి ఉద్యోగాల విషయంలో పునరాలోచన అవసరం. 

‘ఎక్స్‌’లో జేమ్స్‌ క్లియర్, రచయిత


విద్యార్థులతో ఈ పుస్తకాన్ని చదివించండి

ప్రస్తుతం నేను ‘కాన్సెప్షువల్‌ ఫిజిక్స్‌’ అనే పుస్తకం చదువుతున్నాను. దీన్ని హైస్కూల్‌ టీచర్‌ పాల్‌ హెవిట్‌ రాశారు. విద్యార్థులకు ఫిజిక్స్‌ ఎలా బోధించాలో అద్భుతంగా వివరించారు. క్లిష్టమైన అంశాలను అరటిపండు వలిచి పెట్టినట్లు చాలా సులువుగా అర్థమయ్యేలా కళ్లకు కట్టారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలతో ఈ పుస్తకాన్ని చదివించాలి. సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, గణిత సబ్జెక్టుల్లో మంచి అవగాహన ఏర్పడుతుంది.

 యూట్యూబ్‌లో నారాయణమూర్తి, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు


పిల్లలున్న జంటలకు ఏకాంతం అవసరం

పిల్లలున్న జంటలకు సలహా. ఉద్యోగం, ఇంటి పని, పిల్లల బాగోగులతో మీరెంత తీరిక లేకుండా ఉన్నా సరే, వారానికి ఓ పూట 3-4 గంటలు మీ ఇద్దరి ఏకాంతం కోసం కేటాయించాలి. ఇది మనసు విప్పి మాట్లాడుకోవడానికి, కలసి భోంచేయడానికి, భవిష్యత్తు ప్రణాళికకు, గాబరా లేని శృంగారానికి పనికొస్తుంది. ఏకాంతాన్ని వాయిదా వేస్తే, మెల్లిగా ఇద్దరూ అలసిపోయి, ఒకరికొకరు తోడుగా కాకుండా భారంగా మారి, కొన్నాళ్లకు పొరపొచ్చాలు పొడచూపుతాయి. ప్రతిసారీ ఇలాంటి ఏకాంతాన్ని పొందడం సాధ్యం కాదు కానీ ప్రయత్నించాలి.

‘ఎక్స్‌’లో శ్రీకాంత్‌ మిర్యాల, సైకియాట్రిస్ట్‌


 అనుభవాలతో జ్ఞానం ఏకీకృతమైతేనే ప్రయోజనం 

ప్రపంచంలోని అన్ని సమస్యలకూ మన దగ్గర పరిష్కారాలు కనిపిస్తున్నాయి కానీ మన సమస్యలను మనం పరిష్కరించుకోలేకపోతున్నామెందుకు? నిజానికి మనలో జ్ఞానానికి లోటు లేదు. కానీ దురదృష్టం ఏమిటంటే మన జ్ఞానం మన అనుభవాలకు సమాంతరంగా నడుస్తోంది. ఆ రెండూ ఎక్కడా కలవడం లేదు. అవి కలవాలంటే మనలో పరివర్తన అవసరం. అనుభవాల్లో జ్ఞానాన్ని ఏకీకృతం చేయడాన్ని పరిపక్వత అంటారు. స్వీయ అవగాహన ద్వారా మాత్రమే పరిపక్వతను సాధించొచ్చు.

 యూట్యూబ్‌లో మహత్రియా రా, ఆధ్యాత్మికవేత్త

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని