తనకు బదులు మరొకరిని వైద్య పరీక్షలకు పంపి..

బెయిలు పొడిగింపు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఓ నిందితుడు తనకు బదులు మరో వ్యక్తిని ఆసుపత్రికి పంపించాడు. చివరి నిమిషంలో ఈడీ అధికారులు అసలు సంగతిని గుర్తించడంతో చివరకు మళ్లీ జైలుకు వెళ్లాడు.

Published : 19 May 2024 05:48 IST

బెయిల్‌ కోసం ‘లావా’ బాస్‌ నిర్వాకం
చివరి నిమిషంలో గుర్తించిన ఈడీ అధికారులు

దిల్లీ: బెయిలు పొడిగింపు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఓ నిందితుడు తనకు బదులు మరో వ్యక్తిని ఆసుపత్రికి పంపించాడు. చివరి నిమిషంలో ఈడీ అధికారులు అసలు సంగతిని గుర్తించడంతో చివరకు మళ్లీ జైలుకు వెళ్లాడు. ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ ‘లావా’ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో మనీలాండరింగ్‌ కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఈడీ గతేడాది అక్టోబరులో ఆ కంపెనీ ఛైర్మన్, ఎండీ హరి ఓం రాయ్‌ సహా కొందరిని అరెస్టు చేసింది. కొంతకాలం  జైల్లో ఉన్న రాయ్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో దిల్లీ హైకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. వైద్య కారణాల కింద 3 నెలల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న తనకు బెయిల్‌ పొడిగించాలని ఇటీవల రాయ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. అతడికి ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని ఈడీని ఆదేశించింది.  దీంతో మే 6న ఎయిమ్స్‌కు రావాలని అధికారులు నిందితుడికి మెయిల్‌ చేశారు. ఉదయం 9 గంటలకు అధికారులు ఎయిమ్స్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు ఎదురుచూసినా రాయ్‌ రాకపోవడంతో హృద్రోగ విభాగానికి వెళ్లారు. అక్కడ నిందితుడికి  పరీక్షలు చేస్తున్నట్లు వైద్యులు చెప్పారు. అనంతరం నిందితుడి సంతకం కోసం లోపలకు వెళ్లి చూడగా రాయ్‌ పేరుతో మరో వ్యక్తి కనిపించాడు. అతడిని ప్రశ్నించగా తన పేరు నావల్‌ కిశోర్‌రామ్‌ అని, ఉచితంగా చికిత్స చేయిస్తామని చెప్పి తనను తీసుకొచ్చారని చెప్పాడు. దీంతో ఈడీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టుకు రాయ్‌ మోసాన్ని తెలిపారు. న్యాయస్థానం నిందితుడి బెయిల్‌ పొడిగింపు పిటిషన్‌ని కొట్టేసి జుడిషియల్‌ కస్టడీకి అప్పగించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని