నాలుగేళ్లలో అరకోటి వృక్షాలు మాయం

‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయ’ని పెద్దల నానుడి! పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికీ ఎంతో అవసరమని ఇటీవలి పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి.

Published : 19 May 2024 05:50 IST

పంట పొలాల్లోని పచ్చని చెట్లపై వేటు
2018-2022లో దేశంలోని పరిస్థితిపై అధ్యయన నివేదిక
పర్యావరణంపై తీవ్ర ప్రభావం ఉంటుందని వెల్లడి

దిల్లీ: ‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయ’ని పెద్దల నానుడి! పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికీ ఎంతో అవసరమని ఇటీవలి పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ విచ్చల విడి నరికివేతలు ఆగడంలేదు. ముఖ్యంగా పంట పొలాల్లో ఉండే భారీ వృక్షాల తొలగింపు ఇటీవల కాలంలో అత్యధికంగా జరుగుతోంది. సాగుకు అడ్డువస్తున్నాయనో, వాటి నీడ వల్ల తెగుళ్లు సోకుతున్నాయనో, అధిక దిగుబడికి అవరోధమనే అభిప్రాయంతోనో రైతులు వాటిని తొలగిస్తున్నారు. ఇలా 2018-2022 మధ్య నాలుగేళ్లలో మన దేశంలో 50 లక్షలకు పైగా భారీ వృక్షాలు పంట పొలాల నుంచి అదృశ్యమయ్యాయని ఓ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఈ ధోరణి రోజు రోజుకూ పెరిగిపోవడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డెన్మార్క్‌కు చెందిన కోపెన్‌హాగన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం పదేళ్ల అధ్యయన వివరాలతో నివేదికను రూపొందించగా ‘నేచర్‌ సస్టెయినబిలిటీ’ దానిని ప్రచురించింది. కృత్రిమ మేధ ఆధారిత డీప్‌లెర్నింగ్‌ మోడల్స్‌ను వినియోగించి అటవీయేతర ప్రాంతాల్లోని భారీ వృక్షాలను వీరు అధ్యయనానికి ఎంచుకున్నారు. పంటపొలాల్లోని 60 కోట్లకుపైగా వృక్షాలను 2010,2011లలో మ్యాపింగ్‌ చేశారు. 2018 నాటికి వీటిలో 11శాతం మహావృక్షాలు కనుమరుగయ్యాయని గుర్తించారు. 2018-2022 మధ్య నాలుగేళ్లలో భారీ వృక్షాలు 50లక్షలకు పైగా అదృశ్యమయ్యాయని తెలిపారు. వరి సాగు అధికం కావడం, అధిక ఫలసాయం కోసం పొలాల నుంచి చెట్ల తొలగింపు జరుగుతోందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఈ తరహా ధోరణి వల్ల అటవీయేతర ప్రాంతాల్లో పచ్చదనం తగ్గిపోయి పర్యావరణంపై దుష్ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ, హరియాణా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక వనాల పెంపకం పెరిగిందని గుర్తించారు. అయితే, భారీ వృక్షాల వల్ల కలిగే ప్రయోజనాలకు ఇది సరైన ప్రత్యామ్నాయం కాదని, వృక్ష జాతుల వైవిధ్యం కూడా తగ్గిపోతుందనే అభిప్రాయాన్ని నివేదికలో వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని