సీఐఎస్‌ఎఫ్‌ చేతికి పార్లమెంటు భద్రత

పార్లమెంటు భవన సముదాయం భద్రత బాధ్యతలను ఇక నుంచి   కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్‌ఎఫ్‌) నిర్వహించనుంది.

Published : 20 May 2024 06:21 IST

నేటి నుంచే విధుల్లోకి 3,317 మంది సిబ్బంది

దిల్లీ: పార్లమెంటు భవన సముదాయం భద్రత బాధ్యతలను ఇక నుంచి   కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్‌ఎఫ్‌) నిర్వహించనుంది. సీఐఎస్‌ఎఫ్‌ ఉగ్రవాద నిరోధక భద్రత విభాగానికి చెందిన 3,317 మంది సిబ్బంది సోమవారం నుంచి పాత, కొత్త పార్లమెంటు భవనాల వద్ద భద్రత విధులు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు సీఆర్పీఎఫ్‌కు చెందిన 1400 మంది పార్లమెంట్‌ డ్యూటీ గ్రూప్‌(పీడీజీ), 150 మంది దిల్లీ పోలీస్, పార్లమెంటు సెక్యూరిటీ స్టాఫ్‌(పీఎస్‌ఎస్‌)లు పార్లమెంటు భవన సముదాయంలో ఉమ్మడిగా ఈ బాధ్యతలు నిర్వహించాయి. గతేడాది డిసెంబరు 13న లోక్‌సభలో జీరో అవర్‌ జరుగుతుండగా.. ఇద్దరు దుండగులు విజిటర్స్‌ గ్యాలరీలో నుంచి సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. అదే సమయంలో పార్లమెంట్‌ భవనం వెలుపల ఇద్దరు వ్యక్తులు పొగ బాంబులతో ఆందోళన చేశారు. ఈ ఘటన తర్వాత పార్లమెంటు కాంప్లెక్స్‌ భద్రతా సమస్యలను పరిశీలించి తగిన సిఫార్సులు చేయడానికి సీఆర్పీఎఫ్‌ డీజీ అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. ఈ క్రమంలోనే భద్రత బాధ్యతలను సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. డీఐజీ ర్యాంకు స్థాయి సీఆర్పీఎఫ్‌ అధికారి శుక్రవారమే కాంప్లెక్స్‌లోని అన్ని సెక్యూరిటీ కేంద్రాలను సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రిసెప్షన్‌ ప్రాంతంలో ఉండే పురుష, మహిళా సిబ్బందికి సఫారీ సూట్‌తోపాటు లేత నీలం రంగు చొక్కా, గోధుమ రంగు ప్యాంటు యునిఫాం అందించారు. ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిలో సిబ్బందిని మోహరించారని, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తిస్థాయి అనుమతులు వస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని