విశ్వ మానవులం!

ప్రపంచంలో ఏ మూలన ఉన్నాసరే, ఇతరులపైన బాగా ఆధారపడాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. గతంలో స్థానిక వ్యక్తులు, సమస్యల గురించే ఆలోచించాల్సి వచ్చేది. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు మనందరి మీదా ప్రభావం చూపుతాయి.

Published : 20 May 2024 04:18 IST

ప్రపంచంలో ఏ మూలన ఉన్నాసరే, ఇతరులపైన బాగా ఆధారపడాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. గతంలో స్థానిక వ్యక్తులు, సమస్యల గురించే ఆలోచించాల్సి వచ్చేది. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు మనందరి మీదా ప్రభావం చూపుతాయి. ఇకపై ప్రపంచం మొత్తాన్ని, మానవాళి అంతటినీ దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు ఉండాలి. 

‘ఎక్స్‌’లో దలైలామా 


ఆ మార్పు మీరే కావాలి!

మీరు సంతోషంగా ఉండాలనుకుంటే.. వేరొకరిని సంతోషంగా ఉంచండి. మీ జీవితంలోకి నిజాయతీ ఉన్న వ్యక్తి రావాలంటే, మీరు నిజాయతీగా ఉండండి. ఈ ప్రపంచంలో మార్పు చూడాలనుకుంటే.. మీరు కోరుకుంటున్న ఆ మార్పు మీరే అవ్వండి. 

‘ఎక్స్‌’లో దీపక్‌ చోప్రా, వైద్యులు, రచయిత


ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండిలా..

మిమ్మల్ని భయపెట్టే అంశాల్ని రోజూ కొద్దికొద్దిగా పూర్తిచేస్తూ మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి. సాహసోపేతమైన పెట్టుబడి, కఠినమైన వ్యాయామం చేయడం, క్లిష్టమైన పుస్తకం చదవడం, కొత్త పదాల్ని నేర్చుకోవడం, పజిల్స్‌ చేయడం, ఎప్పట్నుంచో వాయిదా వేస్తున్న కీలక విషయాన్ని చర్చించడం.. ఇలా ప్రయత్నించి చూడండి. 

‘ఎక్స్‌’లో హర్ష్‌వర్ధన్‌ గోయెంకా, వ్యాపారవేత్త


అమెరికా కారణంగానే భారత్‌కు భద్రతపరమైన సవాళ్లు

‘ఆపరేషన్‌ స్మైలింగ్‌ బుద్ధ’ పేరుతో భారత్‌ చేపట్టిన తొలి అణు పరీక్షకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే దేశంలో ప్రస్తుత పక్షపాత రాజకీయాల వల్ల ఈ చారిత్రక ఘట్టంపై అవసరమైన చర్చ జరగలేదు. ఈ అణు పరీక్ష కారణంగా మన దేశం మూడు దశాబ్దాల పాటు అమెరికా ప్రోద్బలంతో పలు దేశాల నుంచి సాంకేతిక ఆంక్షలను ఎదుర్కొంది. కానీ అవే భారత్‌కు వరంగా మారాయి. సొంతంగా అణ్వాయుధాలు, బాలిస్టిక్‌ క్షిపణుల తయారీతోపాటు ఇతర సాంకేతిక అంశాల్లో స్వయంసమృద్ధి సాధించి బలమైన శక్తిగా అవతరించింది. అదే సమయంలో అమెరికా నియంతృత్వ దేశమైన చైనా ఎదుగుదలకు దోహదపడింది. ఆ రెండు దేశాలు కలిసి పాకిస్థాన్‌ అణుబాంబు తయారీకి అండగా నిలిచాయి. దానివల్లే భారత్‌ ఇప్పుడు భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.

‘ఎక్స్‌’లో బ్రహ్మ చెలానీ, భౌగోళిక వ్యవహారాల నిపుణులు 


వారి చదువులు ఏమవుతాయో!

దాడుల కారణంగా గాజాలోని 80 శాతం పాఠశాలలు బాగా దెబ్బతిన్నాయి, కొన్ని పూర్తిగా ధ్వంసమయ్యాయి. అందులో 12 విశ్వవిద్యాలయాలూ ఉన్నాయి. పాలస్తీనా విద్యార్థుల పరిస్థితి చూస్తుంటే నా గుండె బరువెక్కుతోంది. గాజాలోని భవిష్యత్తు తరాల చదువులపైనా ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుంది.

 ‘ఎక్స్‌’లో మలాలా యూసఫ్‌ జాయ్, నోబెల్‌ గ్రహీత

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని