ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ

మహారాష్ట్రలోని ఠాణెలో ఓ న్యాయవాదికి మామిడి పండ్ల దొంగతనానికి సంబంధించిన కేసులో వందేళ్ల కిందట ఠాణె న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీ దొరికింది.

Published : 20 May 2024 05:38 IST

మామిడి పండ్ల దొంగతనం కేసులో దోషులుగా నలుగురు యువకులు
వారి భవిష్యత్తు దృష్ట్యా మందలించి వదిలిపెట్టిన న్యాయమూర్తి

ఠాణె: మహారాష్ట్రలోని ఠాణెలో ఓ న్యాయవాదికి మామిడి పండ్ల దొంగతనానికి సంబంధించిన కేసులో వందేళ్ల కిందట ఠాణె న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీ దొరికింది. ఈ కేసులో నలుగురు యువకులను దోషులుగా ప్రకటిస్తూ అప్పటి న్యాయమూర్తి టి.ఎ.ఫెర్నాండెజ్‌ జులై 5, 1924న తీర్పు వెలువరించారు. అనంతరం వారి వయసును పరిగణనలోకి తీసుకుని మందలించి విడిచిపెట్టారు. యువకులకు శిక్ష విధించి వారి జీవితాలను నాశనం చేయాలని తాను భావించడం లేదని తీర్పు వెలువరిస్తూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పుణెలో ఉండే న్యాయవాది పునీత్‌ మహిమాకర్‌ ఇటీవల ఇల్లు మారారు. ఈ క్రమంలో పాత ఇంటి అటకపై చాన్నాళ్లుగా పడిఉన్న ఓ సంచి కనిపించింది. దానిని తెరిచి చూడగా కొన్ని స్థిరాస్తి పత్రాలతోపాటు తీర్పు కాపీ కనిపించిందని ఆదివారం ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ వెల్లడించారు.

‘రాజు (క్రౌన్‌) వెర్సెస్‌ అంజీలో అల్వారీస్, ముగ్గురు ఇతరులు’ కేసు పేరుతో ఉన్న ఈ కేసులో 185 ఆకుపచ్చ మామిడి పండ్ల దొంగతనానికి సంబంధించి నలుగురు యువకులపై ఐపీసీ 379/109 కింద అభియోగాలు మోపారు. బొస్టయివ్‌ ఎల్లీస్‌ ఆండ్రాడెన్‌కు చెందిన మామిడి తోటలో నిందితులు పండ్లను దొంగతనం చేశారని ప్రాసిక్యూషన్‌ తరఫు న్యాయవాది వాదించారు. ఇలా దొంగతనం చేసిన మామిడి పండ్లను నిందితులు స్థానిక మార్కెట్‌లో ఓ డీలర్‌కు విక్రయిస్తుండగా తాము చూశామని కొందరు వ్యక్తులు సాక్ష్యం చేప్పారు. అదే సమయంలో డిఫెన్స్‌ న్యాయవాది తమ కక్షిదారులు నిర్దోషులని వాదించారు. అనంతరం న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ తీర్పు కాపీని పరిరక్షించడంపై ప్రస్తుతం తాను దృష్టి సారించినట్లు పునీత్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని