దిల్లీ మెట్రో రైళ్లలో కేజ్రీవాల్‌ను బెదిరిస్తూ రాతలు

ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై బెదిరింపుల వెనుక భాజపా హస్తం ఉందని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సోమవారం ఆరోపించింది. దిల్లీలోని మెట్రో రైళ్లలో కేజ్రీవాల్‌ను బెదిరిస్తూ కొన్ని రాతలు (గ్రాఫిటీ) వెలసిన నేపథ్యంలో ఆప్‌ ఈ మేరకు స్పందించింది.

Updated : 21 May 2024 05:58 IST

అది భాజపా పనేనంటూ ఆప్‌ ఆరోపణ

దిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై బెదిరింపుల వెనుక భాజపా హస్తం ఉందని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సోమవారం ఆరోపించింది. దిల్లీలోని మెట్రో రైళ్లలో కేజ్రీవాల్‌ను బెదిరిస్తూ కొన్ని రాతలు (గ్రాఫిటీ) వెలసిన నేపథ్యంలో ఆప్‌ ఈ మేరకు స్పందించింది. ఈ అంశంపై చర్చించేందుకు తమకు సమయం కేటాయించాలంటూ ఎన్నికల కమిషన్‌కు ఈ-మెయిల్‌ ద్వారా విజ్ఞప్తి చేసింది. బెదిరింపుల విషయాన్ని తాము పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేపట్టామని ఓ సీనియర్‌ పోలీసు అధికారి వెల్లడించారు. దిల్లీలోని మొత్తం ఏడు ఎంపీ స్థానాల్లోనూ ఓడిపోతున్నామని అర్థమైన భాజపా తీవ్ర ఆందోళనకు గురై కేజ్రీవాల్‌ లక్ష్యంగా పలు రకాలుగా కుట్రలు పన్నుతోందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. దిల్లీలో ఆమె సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘‘మార్చి 21న ఆయన్ను (కేజ్రీవాల్‌ను) అరెస్టు చేశారు. తిహాడ్‌ జైల్లో పెట్టాక 15 రోజుల పాటు ఆయనకు ఇన్సులిన్‌ ఇవ్వలేదు. మేం కోర్టుకు వెళ్లాం. కారాగారం నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని స్వాతి మాలీవాల్‌పై దాడి కేసును ప్రయోగించారు. అయితే బయటకు వచ్చిన వీడియోలు ఆమె చేసిన ఆరోపణలు అవాస్తవమని తేల్చడంతో ఆ కుట్ర విఫలమైంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. రాజీవ్‌ చౌక్, పటేల్‌ చౌక్, పటేల్‌ నగర్‌ మెట్రో స్టేషన్లలో సీఎంను బెదిరిస్తూ ఓ వ్యక్తి రాతలకు పాల్పడ్డాడు. వాటికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియోలో వెల్లువెత్తాయి. ఆయా స్టేషన్లు 24 గంటలూ సీసీటీవీ, భద్రత సిబ్బంది నీడలో ఉంటాయి. అయినా పోలీసులు ఎందుకు స్పందించడంలేదు? సైబర్‌ విభాగం ఎక్కడుంది. ఇదంతా చూస్తుంటే భాజపా పన్నాగమనే అర్థమవుతోంది’’ అని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న చిత్రాలను బట్టి మెట్రో రైళ్లలో కొన్ని, రైల్వే స్టేషన్లలోని సైన్‌ బోర్డులపై కొన్ని రాతలున్నట్టు తెలుస్తోంది. వాటిలోని కొన్ని రాతలు ఇన్‌స్టాగ్రాం హ్యాండిల్‌గా అవతరించాయి. ఇప్పటి వరకూ మొట్టమొదట ఎవరు వీటిని షేర్‌ చేశారన్నది తెలియరాలేదు. 

సానుభూతి కోసం కేజ్రీవాల్‌పై దాడికి ఆప్‌ ఎత్తుగడ : భాజపా

ఆప్‌ తాజా ఆరోపణల నేపథ్యంలో కేజ్రీవాల్‌కు భద్రతను రెట్టింపు చేయాలని భాజపా దిల్లీ విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 25న దిల్లీలో జరగబోయే ఎన్నికల్లో నగర ప్రజల సానుభూతి పొందేందుకు కేజ్రీవాల్‌పై దాడి జరిగే విధంగా ఆయన, ఆప్‌ ఏర్పాట్లు చేసుకుంటాయని ఆరోపించారు. ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి ఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆప్‌ ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. మాలీవాల్‌పై దాడి కేసులో కేజ్రీవాల్‌ తన మౌనాన్ని ఎప్పుడు వీడతారని సచ్‌దేవా నిలదీశారు. 


కేజ్రీవాల్‌ను జ్యుడిషియల్‌ కస్టడీకి అప్పగించండి

 ప్రత్యేక జడ్జికి ఈడీ వినతి

దిల్లీ: మద్యం విధానం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు జ్యుడిషియల్‌ కస్టడీని పొడిగించాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజాకు సోమవారం విజ్ఞప్తి చేసింది. జూన్‌ 2న లొంగిపోయిన అనంతరం ఆయన్ను 14 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరింది. కేజ్రీవాల్‌కు విధించిన కస్టడీ గడువు సోమవారంతో ముగిసిపోయిన నేపథ్యంలో ఈడీ తాజాగా కోర్టును ఆశ్రయించింది. జూన్‌ 1వ తేదీ వరకూ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మేరకు అదే నెల 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది. మద్యం విధానం కుంభకోణంలో కేజ్రీవాల్, సహనిందితురాలు భారాస నాయకురాలు కె.కవితలను విచారించేందుకు బలమైన ఆధారాలు ఉన్నాయని ఈడీ కోర్టుకు వివరించింది. తమ వాదనను బలపరిచేలా వారిద్దరికి వ్యతిరేకంగా రూపొందించిన అదనపు అభియోగపత్రాలను సమర్పించింది. వాటిపై ఈడీ వాదనలను న్యాయమూర్తి మంగళవారం కూడా విననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని