పోస్టల్‌ బ్యాలెట్‌ అంశంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ

పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ అంశంలో ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ఉత్తర్వును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది.

Published : 21 May 2024 06:41 IST

దిల్లీ: పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ అంశంలో ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ఉత్తర్వును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. కదలలేని స్థితిలో ఉన్న తనకు లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని 78 ఏళ్ల మహిళ అభ్యర్థించారు. తొలుత ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టును ఆశ్రయించగా....ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం...రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారినీ న్యాయస్థానం ఆదేశించింది. అయితే, ఆమె శారీరక వైకల్యం 40శాతంగా ఉందన్న వైద్యుల ధ్రువీకరణ పత్రం ప్రకారం పోస్టల్‌ బ్యాలెట్‌ మంజూరుకు అర్హురాలు కాదని రిటర్నింగ్‌ అధికారి ఆ అభ్యర్థనను మే 1న తిరస్కరించారు. ఆమె మళ్లీ హైకోర్టుకు వెళ్లగా...ధర్మాసనం ఈ నెల 6న పిటిషన్‌ను తిరస్కరించింది. ఆమె ఓటు వేయాల్సిన బిలాస్‌పుర్‌ నియోజకవర్గ పోలింగ్‌ 7న ముగుస్తున్నందున 24 గంటల వ్యవధిలో పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ సాధ్యం కాదని పేర్కొంది. దీనిని ఆమె సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తగు శారీరక వైకల్య ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. సంబంధిత నియోజకవర్గంలో పోలింగ్‌ తేదీ కూడా ముగిసిన తర్వాత ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు జూన్‌ 4న జరుగుతుందని, ఈ లోగా పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవచ్చని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపినా ధర్మాసనం సమ్మతించలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని