హేమంత్‌కు బెయిలిస్తే.. అందరూ అడుగుతారు: సుప్రీంకు తెలిపిన ఈడీ

లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్‌ కోరుతూ ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది.

Published : 21 May 2024 06:39 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్‌ కోరుతూ ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది. తనపై దాఖలైన నగదు అక్రమ చలామణీ కేసులో దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ఆయన చెడగొట్టేందుకు ప్రయత్నించొచ్చని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు హేమంత్‌ సోరెన్‌ మధ్యంతర బెయిల్‌ అభ్యర్థనపై ప్రమాణపత్రం దాఖలు చేసింది. సాధారణ పౌరుడికి మించి ఏ రాజకీయ నాయకుడు ‘ప్రత్యేక హోదా’ను ఆశించలేరని పేర్కొంది. ఎన్నికల్లో ప్రచారం కోసమంటూ సోరెన్‌కు మధ్యంతర బెయిలు మంజూరు చేస్తే తమనూ ఇలాగే ‘ప్రత్యేక తరగతి’గా పరిగణించాలంటూ జైళ్లలో ఉన్న అందరూ రాజకీయ నాయకులు కోరే ప్రమాదం ఉందని తెలిపింది. దేశంలో ఏడాది పొడవునా ఏదో ఒక రకమైన ఎన్నికలు జరగుతాయని, ఒకవేళ సోరెన్‌ ‘ప్రత్యేక తరగతి’ అభ్యర్థనను అంగీకరిస్తే.. ఏ ఒక్క రాజకీయ నాయకుడినీ అరెస్టు చేయలేమని, జుడిషియల్‌ కస్టడీలో ఉంచలేమని ఈ సందర్భంగా ఈడీ స్పష్టంచేసింది. హేమంత్‌ సోరెన్‌ అరెస్టును ఝార్ఖండ్‌ హైకోర్టు సమర్థించిందని, ఆయన సాధారణ బెయిల్‌ పిటిషన్‌ను విచారణ న్యాయస్థానం మే 13న కొట్టివేసిందని గుర్తు చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించనుంది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో హేమంత్‌ సోరెన్‌ను జనవరి 31న ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జైలులో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని