సీబీఐలో లంచాధికారులు!

కంచే చేను మేసిన చందంగా.. ఓ కుంభకోణం కేసును విచారిస్తోన్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులే అవినీతికి పాల్పడిన సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Published : 22 May 2024 04:11 IST

ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10 లక్షల వసూలు
పలువురి అరెస్టు

దిల్లీ: కంచే చేను మేసిన చందంగా.. ఓ కుంభకోణం కేసును విచారిస్తోన్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులే అవినీతికి పాల్పడిన సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ నర్సింగ్‌ కాలేజీ స్కామ్‌ వ్యవహారంలో తనిఖీలకు వెళ్లిన సీబీఐ అధికారులే లంచాలు తీసుకోవడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లో ఇటీవల నర్సింగ్‌ కాలేజీ కుంభకోణం వెలుగుచూసింది. దీనిపై అక్కడి హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొన్ని కాలేజీల్లోనూ తనిఖీలు చేపట్టాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ పలు బృందాలను ఏర్పాటు చేసింది. వీరిలో దర్యాప్తు సంస్థ సిబ్బందితోపాటు ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్, పట్వారీలు, ఇతర సిబ్బంది ఉన్నారు. అయితే, తనిఖీల సమయంలో ఈ బృందాలు కాలేజీలకు అనుకూల నివేదికలు ఇచ్చేందుకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సీబీఐ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి.. ప్రాథమిక విచారణ చేపట్టారు. మెరుపు దాడులు నిర్వహించి పలువురిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీబీఐ డిప్యూటీ ఎస్పీతోపాటు మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, మరో 22 మందిపై కేసు నమోదు చేశారు. వీరితోపాటు ఎనిమిది నర్సింగ్‌ కాలేజీల డైరెక్టర్లు, ఛైర్‌పర్సన్లు, సిబ్బంది, మధ్యవర్తులపైనా ఎఫ్‌ఐఆర్‌ రాశారు. అవినీతికి పాల్పడితే తమ సిబ్బందినైనా సరే వదిలిపెట్టేది లేదని సీబీఐ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని