మధ్యంతర బెయిల్‌ ఎందుకివ్వాలి?

ఝార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు విషయమై సర్వోన్నత న్యాయస్థానంలో మంగళవారం తీవ్ర వాదోపవాదనలు జరిగాయి.

Published : 22 May 2024 04:13 IST

హేమంత్‌ సోరెన్‌ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
నేడూ కొనసాగనున్న వాదనలు

దిల్లీ: ఝార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు విషయమై సర్వోన్నత న్యాయస్థానంలో మంగళవారం తీవ్ర వాదోపవాదనలు జరిగాయి. ట్రయల్‌ కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌ ఎలా మంజూరు చేయగలమని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. తొలుత దీనికి సమాధానమివ్వాలని తెలుపగా హేమంత్‌ సోరెన్‌ తరఫు న్యాయవాదులు బుధవారం వరకు సమయం కోరారు. దీంతో కేసు విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. అంతకుముందు ధర్మాసనం మరో ప్రశ్నను సంధించింది. భూ కుంభకోణంతో ముడిపడిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఫిర్యాదును ట్రయల్‌ కోర్టు పరిశీలనలోకి తీసుకున్న తర్వాత హేమంత్‌ సోరెన్‌ అరెస్టు చెల్లుబాటుపై రిట్‌ కోర్టు విచారణ జరపటం సమంజసమేనా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీనికి సోరెన్‌ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ సమాధానమిస్తూ...దర్యాప్తు సంస్థ ఫిర్యాదును ట్రయల్‌ కోర్టు పరిశీలనలోకి తీసుకుని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని మాత్రమే అభిప్రాయపడిందని తెలిపారు. నేర నిరూపణ జరగలేదన్నారు. వ్యక్తి స్వేచ్ఛ హననానికి సంబంధించిన అంశాన్ని తాము ధర్మాసనం ముందు ఉంచామని పేర్కొన్నారు. మనీలాండరింగ్‌ చట్టం కింద అరెస్టును ఎందుకు ప్రశ్నించరాదని వాదించారు. వ్యక్తి హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు రిట్‌ కోర్టు జోక్యం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు ఈ వాదనలను తోసిపుచ్చారు. హేమంత్‌ సోరెన్‌కు మధ్యంతర బెయిల్‌ ఇవ్వరాదని కోరారు. ఈ కేసులో బుధవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని