దేశానికి ముప్పుగా భూతాపం.. క్లైమేట్‌ ఛేంజ్‌ ఇన్‌ది ఇండియన్‌ మైండ్‌-2023 నివేదికలో వెల్లడి

భారతదేశానికి భూతాపం (గ్లోబల్‌ వార్మింగ్‌) అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తోందని జనాభాలో 90 శాతానికిపైగా ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది.

Updated : 23 May 2024 08:09 IST

కర్బన ఉద్గారాలు సున్నాకు తగ్గించాలి

ఈనాడు, హైదరాబాద్‌: భారతదేశానికి భూతాపం (గ్లోబల్‌ వార్మింగ్‌) అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తోందని జనాభాలో 90 శాతానికిపైగా ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. ఉష్ణతాపంతో వరదలు, కరవు, వడగాలులు, తీవ్ర నీటి కొరత, కాలుష్యం, జంతువులకు రోగాలు, అతివృష్టి, అనావృష్టి సంభవిస్తోందని సర్వేలో పాల్గొన్న పలువురు తెలిపారు. భూతాపాన్ని తగ్గించేందుకు సంప్రదాయేతర ఇంధన వనరులు వినియోగించాలని, కర్బన ఉద్గారాలను సున్నాకు తగ్గించాలని అభిప్రాయపడ్డారు. 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నాకు తేవాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు వేగంగా అడుగులు వేయాలని కోరారు. యేల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ కమ్యూనికేషన్, సీఓటర్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా ‘క్లైమేట్‌ ఛేంజ్‌ ఇన్‌ది ఇండియన్‌ మైండ్‌ -2023’ నివేదికను అమెరికాలో విడుదల చేశాయి.

దుర్భరంగా ప్రజల జీవితాలు.. 

వాతావరణ మార్పులతో ప్రజల దైనందిన జీవితాలు దుర్భరంగా ఉంటున్నట్లు సర్వేలో తెలిసింది. వాతావరణ మార్పులతో కుటుంబాలకు వస్తున్న ఆదాయం సరిపోవడం లేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. భూతాపాన్ని తగ్గించేందుకు ఇంధన సామర్థ్య ఉపకరణాలు(ఎనర్జీ ఎఫిషియంట్‌ అప్లియన్సెస్‌), విద్యుత్తు వాహనాల కొనుగోలుకు ఎక్కువ మొత్తంలో ఖర్చుచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వాతావరణ మార్పులతో తీవ్ర వరదలు, తుపానులు వస్తున్నాయని యేల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఆంథోని లిసిరోవిట్జ్‌ చెప్పారు. భారతీయులకు స్వచ్ఛ ఇంధనంతో ఆర్థిక సుస్థిరత, మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్స్‌లాండ్‌ ప్రొ.డా.జగదీష్‌ థాకెర్‌ తెలిపారు.


సర్వేలో వెల్లడైన విషయాలు...

  • మానవ తప్పిదాలే భూతాపానికి కారణమని 52 శాతం మంది భావిస్తుంటే, 38 శాతం మంది పర్యావరణంలో సహజ మార్పులు ఈ పరిస్థితికి కారణమని చెప్పారు. 
  • బొగ్గు ఆధారిత ప్లాంట్లపై నిషేధం, ఉన్నవాటిని మూసివేసి వాటి స్థానంలో సౌర, పవన విద్యుత్తు ప్లాంట్లు నెలకొల్పేందుకు 84శాతం మంది సానుకూలత వ్యక్తం చేశారు. 
  • భూతాపాన్ని తగ్గించేందుకు తీసుకునే చర్యలతో ఆర్థిక వృద్ధి, కొత్త ఉద్యోగాలు వస్తాయని 74 శాతం మంది భావిస్తే, ఆర్థిక మందగమనంతోపాటు ఉద్యోగాల్లో కోత పడుతుందని 21 శాతం మంది వెల్లడించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని