హేమంత్‌ సోరెన్‌పై సుప్రీం ఆగ్రహం

భూ కుంభకోణంతో ముడిపడిన మనీలాండరింగ్‌ కేసులో మధ్యంతర బెయిల్‌ పొందాలన్న ఝార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ ప్రయత్నాలు ఫలించలేదు.

Published : 23 May 2024 05:53 IST

వాస్తవాలను దాచారని ఆక్షేపణ
బెయిల్‌ పిటిషన్‌ వెనక్కి తీసుకున్న జేఎంఎం నేత

దిల్లీ: భూ కుంభకోణంతో ముడిపడిన మనీలాండరింగ్‌ కేసులో మధ్యంతర బెయిల్‌ పొందాలన్న ఝార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ కేసులో వాస్తవాలను దాచి బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారంటూ హేమంత్‌ సోరెన్‌పై సుప్రీంకోర్టు బుధవారం  మండిపడింది. దీంతో బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సోరెన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టుకు తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు ప్రచారం నిమిత్తం తనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని సోరెన్‌ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌ విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై విచారణ ప్రారంభించిన జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మతో కూడిన సెలవుకాలీన ధర్మాసనం.. సోరెన్‌ పిటిషన్‌పై అసహనం వ్యక్తం చేసింది. ట్రయల్‌ కోర్టులో రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయడం, అది తిరస్కరణకు గురికావడం గురించి తమకు తెలపలేదని, కేసులో వాస్తవాలను దాచడానికి ప్రయత్నించారని ఆగ్రహించింది. ఒకేరకమైన ఉపశమనం కోసం రెండు న్యాయస్థానాలను ఆశ్రయించడాన్ని  ప్రశ్నించింది. అనంతరం బెయిల్‌ అభ్యర్థనను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేయటానికి ధర్మాసనం సిద్ధం కాగా...తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు కపిల్‌ సిబల్‌ తెలిపారు. బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించేందుకు ధర్మాసం అనుమతించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని