నర్సింగ్‌ కళాశాల లంచాల కుంభకోణం.. సీబీఐ ఇన్‌స్పెక్టర్‌ సర్వీస్‌ నుంచి తొలగింపు

మధ్యప్రదేశ్‌కు చెందిన నర్సింగ్‌ కళాశాల లంచాల కుంభకోణం కేసులో కళాశాల ఛైర్మన్‌ నుంచి రూ.10 లక్షల లంచం తీసుకొంటూ అరెస్టయిన తమ ఇన్‌స్పెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ను సీబీఐ సర్వీసు నుంచి తొలగించినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు.

Published : 23 May 2024 05:22 IST

దిల్లీ: మధ్యప్రదేశ్‌కు చెందిన నర్సింగ్‌ కళాశాల లంచాల కుంభకోణం కేసులో కళాశాల ఛైర్మన్‌ నుంచి రూ.10 లక్షల లంచం తీసుకొంటూ అరెస్టయిన తమ ఇన్‌స్పెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ను సీబీఐ సర్వీసు నుంచి తొలగించినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. అవినీతిని ఎంతమాత్రం సహించకూడదన్న తమ విధానంలో భాగంగా రాజ్యాంగంలోని 311 అధికరణం కింద రాహుల్‌ రాజ్‌ను సర్వీసు నుంచి తొలగిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ నిర్ణయం తీసుకొంది. మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాల మేరకు ఆ రాష్ట్రంలోని నర్సింగ్‌ కళాశాలల్లో మౌలిక సదుపాయాల పరిశీలనకు ఏర్పడిన సీబీఐ బృందాల్లో ఒకటి లంచాలు తీసుకొంటూ పట్టుబడిన విషయం తెలిసిందే. మలయ్‌ నర్సింగ్‌ కళాశాల ఛైర్మన్‌ అనిల్‌ భాస్కరన్, సుమా అనిల్‌ దంపతుల నుంచి ఆదివారం రూ.10 లక్షల లంచం తీసుకొంటూ రాహుల్‌ రాజ్‌ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో అనిల్‌ భాస్కరన్‌ దంపతులను కూడా అరెస్టు చేశారు. కేసు ఎఫ్‌ఐఆర్‌లో పేరున్న డీఎస్పీ ఆశిష్‌ ప్రసాద్‌ను సీబీఐ తమ ప్రధాన కార్యాలయానికి అటాచ్‌ చేసింది. అలాగే విచారణలో సీబీఐ బృందానికి సహకరించేందుకు వచ్చిన మధ్యప్రదేశ్‌ పోలీసులు సుశీల్‌కుమార్‌ మజోకా, రిషికాంత్‌ అసాథేలకు సైతం లంచాల స్వీకరణలో పాత్ర ఉన్నట్లు రుజువైనందున వారిద్దరినీ రాష్ట్ర పోలీసుశాఖకు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని