డబ్బు వసూలు కానంత మాత్రాన అవినీతి లేదనలేం: దిల్లీ హైకోర్టు

లంచం సొమ్ము వసూలు కానంత మాత్రాన అవినీతి చోటుచేసుకోలేదని ప్రాథమిక రుజువుగా పరిగణించలేమని దిల్లీ హైకోర్టు పేర్కొంది. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా తప్పులు చేయడానికి నేరగాళ్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతుంటారని తెలిపింది.

Published : 23 May 2024 05:52 IST

దిల్లీ: లంచం సొమ్ము వసూలు కానంత మాత్రాన అవినీతి చోటుచేసుకోలేదని ప్రాథమిక రుజువుగా పరిగణించలేమని దిల్లీ హైకోర్టు పేర్కొంది. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా తప్పులు చేయడానికి నేరగాళ్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతుంటారని తెలిపింది. దిల్లీ మద్యం విధాన కుంభకోణంలో ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియాకు న్యాయస్థానం మంగళవారం బెయిల్‌ను నిరాకరించిన విషయం తెలిసిందే. పూర్తి తీర్పును బుధవారం వెబ్‌సైట్లో చేర్చారు. సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చినప్పటికీ తన నుంచి ఎలాంటి నగదు వసూలు చేయలేదన్న సిసోదియా వాదనను ఆమోదించలేమని జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ స్పష్టంచేశారు. వేర్వేరు వ్యక్తులతో ముడిపడిన నగదు అక్రమ చలామణీ కేసులో ఒక వ్యక్తి నుంచి డబ్బు వసూలు కావాల్సి ఉండడం తప్పనిసరేమీ కాదని చెప్పారు. ఈ కేసులో ప్రభుత్వ కార్యాలయంలో అవినీతి, నగదు అక్రమ చలామణీకి సంబంధించిన తీవ్ర అభియోగాలు ఉన్నాయన్నారు. పేదప్రజలకు చట్టబద్ధంగా అందాల్సిన వనరుల్ని గొప్పవాళ్లు దోచుకోవడం.. అవినీతిలో నికృష్టమైన రీతి అని అన్నారు. ఈ మేరకు 106 పేజీల తీర్పు వెలువరించారు. చిరువ్యాపారులకు ఆస్కారం లేకుండా కండబలం, అర్ధబలం ఉన్నవారికే వ్యాపారమంతా దక్కేలా నూతన మద్యం విధానం ఉందన్నారు. విధాన రూపకర్తలకు ఆర్థిక లబ్ధి కలిగించేలా ఒక సిండికేట్‌ ఏర్పడడానికి ఇది అవకాశం కల్పించిందని వ్యాఖ్యానించారు. అవినీతి ప్రవాహ మార్గంలో కోర్టులు ముల్లుల మాదిరిగా ఉంటున్నాయని అనుకున్నా అవి చివరకు ప్రజల విజయానికి దోహదపడతాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని