ప్రైవేటు వైద్య కళాశాలల్లో చదివారని గ్రామీణ సేవలకు మినహాయింపు ఇవ్వాలా?

ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివిన వారికి దేశానికి తమ వంతు సేవ చేయాల్సిన బాధ్యత ఉండదా అని సుప్రీంకోర్టు బుధవారం ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా పర్యటించడం, వివిధ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం ఎంతో అద్భుతంగా ఉంటుందని జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌తో కూడిన సెలవు కాలీన ధర్మాసనం అభిప్రాయపడింది.

Published : 23 May 2024 05:25 IST

వైద్య విద్యార్థులను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

దిల్లీ: ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివిన వారికి దేశానికి తమ వంతు సేవ చేయాల్సిన బాధ్యత ఉండదా అని సుప్రీంకోర్టు బుధవారం ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా పర్యటించడం, వివిధ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం ఎంతో అద్భుతంగా ఉంటుందని జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌తో కూడిన సెలవు కాలీన ధర్మాసనం అభిప్రాయపడింది. గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా పని చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిబంధన నుంచి తమకు మినహాయింపునివ్వాలని కోరుతూ కర్ణాటకలోని ఓ ప్రైవేటు డీమ్డ్‌ యూనివర్శిటీ వైద్య విద్యార్థులు కొందరు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అధిక రుసుములు చెల్లించి ప్రైవేటు వైద్య కళాశాలల్లో చదువుతున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తామన్న అఫిడవిట్‌ సమర్పించాల్సిన అవసరం లేకుండానే డిగ్రీ అందజేసేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరుతున్నారు. కర్ణాటక వైద్య మండలిలో శాశ్వత నమోదుకు అవకాశం కల్పించాలని కూడా పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ ప్రారంభించిన ధర్మాసనం కర్ణాటక ప్రభుత్వ స్పందన కోరుతూ నోటీసు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని