ఈసారి ఐఐటీ విద్యార్థులకూ ఉద్యోగాల్లేవ్‌!

నియామకాల విషయంలో అనూహ్యమైన సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. 23 క్యాంపస్‌లలో మొత్తం 38 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించలేదు.

Updated : 24 May 2024 05:41 IST

ఈ ఏడాది ఐఐటీలు ప్రాంగణ నియామకాల విషయంలో అనూహ్యమైన సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. 23 క్యాంపస్‌లలో మొత్తం 38 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించలేదు. ప్రాంగణ నియామకాల కోసం నమోదు చేసుకున్న 21,500 మందిలో 13,410 మంది మాత్రమే కొలువులకు ఎంపికయ్యారు. 8,090 మంది ఇంకా సంస్థల పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు.

- ఇండియన్‌ టెక్‌ అండ్‌ ఇన్‌ఫ్రా 


సమాచార వేదిక వైఫల్యాలు, సవాళ్లు లేకపోతే వృద్ధి లేదు

- అనుష్కా సోహమ్‌ బథ్వాల్, సామాజిక వ్యాపారవేత్త

నువ్వు జీవితంలో ఎప్పుడూ వైఫల్యాన్ని చూడలేదంటే, నీ లక్ష్యాలు అంత గొప్పవి కాదని అర్థం. నీకు ఎన్నడూ సవాళ్లు ఎదురు కాలేదంటే నువ్వు అసలు లక్ష్య సాధనకు ప్రయత్నమే చేయలేదని అర్థం. వైఫల్యాలు మన వృద్ధికి ఇంధనంగా పనిచేస్తాయి. సవాళ్లు మన నైపుణ్యాలను సానబెడతాయి. ప్రయోగించినప్పుడే ఆయుధం ఎంత శక్తిమంతమైనదో తెలుస్తుంది. ఉపయోగించినప్పుడే నీ సామర్థ్యాల సత్తా ఏంటో అర్థమవుతుంది.


మన విమానాల్లో.. వైఫై ఎందుకు ఉండటం లేదు! 

- ప్రొఫెసర్‌ వి.రామ్‌గోపాల్‌రావు, వైస్‌ ఛాన్సలర్, బిట్స్‌ విద్యాసంస్థలు

భారతీయ సంస్థలేవీ తమ విమానాల్లో వైఫై సదుపాయాన్ని అందించకపోవడం ఆశ్చర్యకరం. ఇండియా నుంచి వెళ్లే అన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలూ ఈ సేవల్ని అందిస్తున్నాయి. అమెరికాలో దేశీయ విమాన సర్వీసుల్లోనూ వైఫై అందుబాటులో ఉంటోంది. విమానయాన సంస్థలకు ఇది మంచి ఆదాయ మార్గం కూడా. మరి మనకు ఈ విషయంలో బ్రిటిష్‌ కాలంనాటి నిబంధనలు అడ్డు పడుతున్నాయా, లేకపోతే విమానయాన సంస్థలు ఈ సేవలు అనవసరం అనుకుంటున్నాయా? 


పింక్‌ ఈ-రిక్షా డ్రైవర్‌కు మహిళా సాధికారత పురస్కారం 

లండన్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహరాయిచ్‌కు చెందిన ఆర్తి అనే 18 ఏళ్ల పింక్‌ ఈ-రిక్షా డ్రైవర్‌కు లండన్‌లో ప్రతిష్ఠాత్మకమైన ‘అమల్‌ క్లూనే మహిళా సాధికారత పురస్కారం’ లభించింది. బకింగ్‌హాం ప్యాలెస్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో కింగ్‌ చార్లెస్‌-3 ఆమెకు దీనిని ప్రదానం చేశారు. కాలుష్య రహితమైన ఇంధనంతో రిక్షాను నడుపుతూ మహిళలకు సురక్షితమైన ప్రయాణాన్ని సమకూరుస్తున్నందుకు పురస్కారంతో గుర్తిస్తున్నట్లు బ్రిటన్‌ హక్కుల ఉద్యమకర్త అమల్‌ క్లూనే తెలిపారు. నేరుగా బ్రిటన్‌ రాజుతో భేటీ కావడంపై ఆర్తి ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ-రిక్షా నడపడాన్ని తానెంతగా ఇష్టపడతానో ఆయనకు వివరించినప్పుడు ఆసక్తిగా విన్నారని ఆమె తెలిపారు. సాధారణంగా పురుషులే ఉండే రంగంలోకి ఆమె వచ్చి ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. పురస్కారాన్ని అందుకునేందుకు బకింగ్‌హాం ప్యాలెస్‌కు కూడా ఆర్తి ఈ-రిక్షాలోనే వచ్చారు. 


మళ్లీ బాంబు బెదిరింపులు

దిల్లీలో 12కు పైగా కళాశాలల్లో తనిఖీలు 

దిల్లీ: దేశ రాజధాని నగరంలో డజనుకు పైగా కళాశాలలకు గురువారం బాంబు బెదిరింపులతో ఈ-మెయిళ్లు అందాయి. ఈ జాబితాలో దిల్లీ విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రతిష్ఠాత్మక లేడీ శ్రీరాం (ఎల్‌ఎస్‌ఆర్‌) కళాశాల, హన్స్‌రాజ్‌ కళాశాల, రామ్‌జస్‌ కళాశాల వంటివి ఉన్నాయి. సమాచారం అందగానే తనిఖీలు చేపట్టిన అధికారులు అవి ఉత్తుత్తి బెదిరింపులేనని తేల్చారు. యూరప్‌ మెయిలింగ్‌ సర్వీసు కంపెనీకి చెందిన ‘‘బీబుల్‌.కామ్‌’’ నుంచి ఈ-మెయిళ్లు వచ్చినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. గతంలో దిల్లీలోని స్కూళ్లు, ఆసుపత్రులకు కూడా ఇదే సర్వీసు నుంచి ఈ-మెయిళ్లు అందాయన్నారు. ఈ హత్యాకాండ వెనుక ‘టైర్రరైజర్‌ గ్రూపు 111’ ఉన్నట్లు మెయిళ్లలో పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా దిల్లీలో ఈ విధమైన బెదిరింపులు వస్తున్నాయి.  


ఏడు దశల్లో 121 మంది నిరక్షరాస్యులు: ఏడీఆర్‌

దిల్లీ: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఏడు దశల్లో కలిపి పోటీచేస్తున్న అభ్యర్థుల్లో 121 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. మరో 359 మంది ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. లోక్‌సభకు మొత్తం 8,360 మంది పోటీచేస్తున్నారు. వారిలో 8,337 మంది అభ్యర్థుల వివరాలను ఏడీఆర్‌ విశ్లేషించగా ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇక 647 మంది అభ్యర్థులు తాము ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నట్లు వెల్లడించగా, 1,303 మంది 12వ తరగతి చదివామని, 1,502 మంది డిగ్రీ చదివినట్లు ప్రకటించారు. 198 మంది అభ్యర్థులు తాము డాక్టరేట్‌ చేసినట్లు పేర్కొన్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని