కాళ్లు, చేయి లేకున్నా బేస్‌క్యాంపును అధిరోహించిన కౌశిక్‌

విధి వంచించింది. ప్రమాదంలో ఓ చేయి, రెండు కాళ్లు పోయాయి. అయితేనేం.. తన ఆశయానికి అంగవైకల్యం అడ్డే కాదని భావించారు.

Updated : 24 May 2024 05:21 IST

పణజీ: విధి వంచించింది. ప్రమాదంలో ఓ చేయి, రెండు కాళ్లు పోయాయి. అయితేనేం.. తన ఆశయానికి అంగవైకల్యం అడ్డే కాదని భావించారు. ఎవరెస్టు బేస్‌ క్యాంపునకు చేరుకుని విజయ కేతనం ఎగురవేశారు. ఆయనే గోవాకు చెందిన 30 ఏళ్ల టింకేశ్‌ కౌశిక్‌. తొమ్మిదేళ్ల ప్రాయంలోనే కరెంట్‌ షాక్‌తో రెండు కాళ్లు, ఓ చేయి కోల్పోయారు. కృత్రిమ అవయవాలను వాడుతున్నారు. కొన్నేళ్ల క్రితం గోవాకు వచ్చిన కౌశిక్‌ ఫిట్‌నెస్‌ కోచ్‌గా పని చేస్తున్నారు. ఎలాగైనా ఎవరెస్టును అధిరోహించాలని ఆశయంగా పెట్టుకున్న ఆయన.. అందుకోసం తీవ్రంగా శ్రమించారు. ఈ నెల 4న నేపాల్‌ నుంచి సాహసయాత్ర ప్రారంభించి 11న బేస్‌ క్యాంపుపై జాతీయజెండా ఎగురవేశారు. ‘‘ఫిట్‌నెస్‌ కోచ్‌ అయినందున పర్వతారోహణ చాలా తేలిక అని భావించా. కానీ, దానికి సన్నద్ధమవుతోన్న సమయంలో బేస్‌ క్యాంపు వరకు వెళ్లడం సాహసమేనని గుర్తించా. ఎలాగైనా సాధించాలని నిశ్చయించుకున్నా. శారీరక వైకల్యంతోపాటు పర్వతాల్లో ప్రతికూల వాతావరణం కూడా ఎంతో ఇబ్బంది పెట్టింది. అయినప్పటికీ మనోధైర్యంతో ముందుకువెళ్లా. వారం రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింది. చివరకు ఎవరెస్టు బేస్‌క్యాంపును చేరుకున్నా. అవి నాకెంతో భావోద్వేగ క్షణాలు’’ అని కౌశిక్‌ వివరించారు.  


తండ్రితో కలిసి యువతి..

- ముంబయి విద్యార్థిని కామ్య కార్తికేయన్‌ ఘనత

జంశెద్‌పుర్‌: ముంబయిలోని నేవీ పాఠశాలలో 12వ తరగతి విద్యార్థిని, 16 ఏళ్ల కామ్య కార్తికేయన్‌ నేపాల్‌ వైపు నుంచి ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించింది. ఎవరెస్ట్‌ అధిరోహించే సమయంలో కామ్య వెంట ఆమె తండ్రి, భారత నౌకాదళం కమాండర్‌ ఎస్‌.కార్తికేయన్‌ ఉన్నారని టాటా స్టీల్‌ అడ్వెంచర్‌ ఫౌండేషన్‌ (టీఎస్‌ఏఎఫ్‌) గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 20న తండ్రీకుమార్తెలు 8,848 మీటర్ల ఎత్తైన శిఖరంపైకి చేరుకున్నట్లు వెల్లడించింది. ‘‘ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించాలన్న లక్ష్యంలో భాగంగా ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి కామ్య ఆరో మైలురాయిని అధిగమించింది. ఈ ఏడాది డిసెంబరులో అంటార్కిటికాలోని విన్సన్‌ మాసీఫ్‌ శిఖరాన్ని అధిరోహించనుంది’’ అని పశ్చిమ నౌకాదళం ఎక్స్‌లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని