మణిపుర్‌ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలకు సుప్రీం నిరాకరణ

న్యాయస్థానాలు భావోద్వేగాల ఆధారంగా విధులు నిర్వహించబోవని, చట్ట నిబంధనల ప్రకారమే నడుచుకుంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Published : 25 May 2024 05:51 IST

దిల్లీ: న్యాయస్థానాలు భావోద్వేగాల ఆధారంగా విధులు నిర్వహించబోవని, చట్ట నిబంధనల ప్రకారమే నడుచుకుంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మణిపుర్‌లో అల్లర్ల కారణంగా వేరే ప్రాంతాలకు వెళ్లిన ప్రజల ఆస్తులను పరిరక్షించాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయని ఉన్నతాధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలన్న విజ్ఞప్తిని తిరస్కరిస్తూ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా పలువురిపై చర్యలు తీసుకోవాలన్న పిటిషనర్‌ వాదనతో తాము ఏకీభవించడంలేదని జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌తో కూడిన సెలవు కాలీన ధర్మాసనం తెలిపింది. మణిపుర్‌లో జాతుల మధ్య ఘర్షణల కారణంగా తరలిపోయిన వారి ఆస్తులను పరిరక్షించాలంటూ గత ఏడాది సెప్టెంబరు 25న సుప్రీంకోర్టు ఉత్తర్వు ఇచ్చింది. అయితే, ఇప్పటికీ తాము రాష్ట్రంలోకి రాలేకపోతున్నామని పిటిషనర్లు తెలిపారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆక్రమణదారులుగా పేర్కొంటూ చర్యలు తీసుకోమనడం తగదని ధర్మాసనం తెలిపింది. వారి సమస్య పట్ల సానుభూతి ఉందని పేర్కొంది. పరిష్కారానికి చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని పిటిషనర్లకు సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు