కోరిక బలంగా ఉంటే.. మనల్ని ఏదీ ఆపలేదు!

సాధించాలనే కోరిక బలంగా ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోగలం. అందుకు నా జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి చెబుతా. ఇద్దరు పిల్లల తల్లి అయ్యాక కూడా చదువు కొనసాగించా. ఏలూరు డీఎస్పీగా ఉన్నప్పుడు ‘న్యాయశాస్త్రం’ పరీక్షలకి సెలవు అడిగితే ఎస్పీ ఇవ్వలేదు.

Published : 26 May 2024 04:43 IST

సాధించాలనే కోరిక బలంగా ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోగలం. అందుకు నా జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి చెబుతా. ఇద్దరు పిల్లల తల్లి అయ్యాక కూడా చదువు కొనసాగించా. ఏలూరు డీఎస్పీగా ఉన్నప్పుడు ‘న్యాయశాస్త్రం’ పరీక్షలకి సెలవు అడిగితే ఎస్పీ ఇవ్వలేదు. పరీక్షలు   రాయడానికి మాత్రం అనుమతించారు. పాలకొల్లులో పరీక్షా కేంద్రం. మొదటిరోజు.. ఉదయం వరకట్న వేధింపులతో ఒక మహిళ చనిపోతే  వెళ్లి కేసు వివరాలన్నీ తీసుకుని ఎస్పీకీ, ఇన్‌స్పెక్టర్‌కీ సమాచారం ఇచ్చి పరీక్షకు వెళ్లాను. రెండో రోజు పెద్ద రోడ్డు ప్రమాదం, మూడో రోజు హత్య జరిగితే వెళ్లొచ్చి పరీక్షలకు హాజరయ్యా. మొత్తానికి ఆ పరీక్షలు విజయవంతంగా రాశాను. మనలోని ఇచ్ఛ బలంగా ఉంటే ఏదీ మనల్ని ఆపలేదు.

కేజీవీ సరిత ఎస్పీ, సీఐడీ-ఏపీ


వీరే అసలైన ధనవంతులు

సంపూర్ణ ఆరోగ్యం, కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే వెసులుబాటు, నిరంతరం నేర్చుకొనే అవకాశం, ఆసక్తికి అనుగుణమైన ఉద్యోగం, కెరీర్‌లో వృద్ధి, అర్థవంతమైన స్నేహాలు, మానసిక ప్రశాంతత.. ఇవన్నీ ఉన్నవారు అదృష్టవంతులు కాదు అసలైన ధనవంతులు. ఇవన్నీ డబ్బుతో కొనగలిగేవి కావు. మన ఎంపిక, ప్రయత్నాల ద్వారా పొందేవి.

రణ్‌వీర్‌ అలహాబాదియా, ఇన్‌ఫ్లూయెన్సర్‌ 


పుస్తకాలు చదవనివారు నిరక్షరాస్యులే

పుస్తకాలు చదవనివారికి, నిరక్షరాస్యులకు ఏ మాత్రం తేడా లేదు. చదవలేకపోవడం వల్ల నిరక్షరాస్యులు జ్ఞానానికి దూరమైనట్లే, విద్యావంతులు పుస్తకాలు చదవకపోవడం వల్ల విస్తృత జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. 

పుస్తక పఠనం అలవాటు చేసుకోండి. అదో వ్యసనంలా మారి ఇతర చెడు వ్యసనాలను మీ నుంచి దూరం చేస్తుంది.

సంజనా సామ్రాజ్, విద్యా రంగ పరిశోధకురాలు


మీ పరిమితులు.. మీరు కట్టుకున్న అడ్డుగోడలే

లక్ష్య సాధన గురించి మీలో వచ్చే సందేహాలు, భయాలు ఊహాత్మకమైనవి. ఊహ ఎప్పుడూ వాస్తవాన్ని పెద్దదిగా చూపుతుంది. ఒక్కో అడుగు వేసేకొద్దీ ఆ భయాలన్నీ పటాపంచలవుతాయి. మీ పరిమితులు మీకు మీరు కట్టుకున్న అడ్డుగోడలే. ఆగకుండా ముందుకు వెళ్తే అవే బద్దలవుతాయి. అలాగే మీరు చెప్పే సాకులు మీ కాళ్లకు మీరే వేసుకొనే బంధనాలు. వాటిని తెంచుకుంటేనే మీ ప్రయాణాన్ని మొదలుపెట్టగలరు.

మార్క్‌ మాన్సన్, రచయిత


తల్లిదండ్రుల కష్టాన్ని అవమానించొద్దు

మీ తల్లిదండ్రుల చదువు, రూపం,  ఆర్థిక స్థితి, సామాజిక నేపథ్యం ఆధారంగా వారిపై ఓ అంచనాకు రాకండి. వారు మీపై చూపే ప్రేమ, మీ సంరక్షణ కోసం చేసిన త్యాగాలు, వారు ఎదుర్కొన్న పరిస్థితులను తెలుసుకొని వారిని 

గౌరవించండి. అమ్మానాన్నల వృత్తిని మీరు చిన్నతనంగా భావిస్తున్నారంటే వారి కష్టాన్ని అవమానిస్తున్నట్లే.

మోతీలాల్‌ ఓస్వాల్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు మోతీలాల్‌


పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్న పొగాకు పరిశ్రమ

పొగాకు పరిశ్రమ కొత్త తరాన్ని తమ వినియోగదారులుగా మార్చుకొనేందుకు అనైతిక విధానాలను అవలంబిస్తోంది. ఈ-సిగరెట్లను పాఠశాల విద్యార్థులు వినియోగించే వస్తువుల రూపాల్లో తయారు చేయడం, క్యాండీల రుచిని తలపించే ఫ్లేవర్లను మార్కెట్లోకి తేవడం ద్వారా పిల్లలను వాటికి బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తోంది. దీన్ని అడ్డుకొని భావితరాలను రక్షించడానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని