మద్యపాన నిషేధంతో బిహార్‌లో సానుకూల ఫలితాలు

బిహార్‌లో మద్య నిషేధం అమలు సానుకూల ఫలితాలు ఇస్తున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. 2016లో ఈ చట్టం అమలులోకి రాగా.. 24 లక్షల మద్యపాన సంబంధ కేసులు తగ్గాయని, కనీసం 21 లక్షల గృహహింస కేసులను తప్పించగలిగారని పేర్కొంది.

Published : 27 May 2024 05:41 IST

తగ్గిన గృహహింస, లైంగిక హింస
ఓ అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: బిహార్‌లో మద్య నిషేధం అమలు సానుకూల ఫలితాలు ఇస్తున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. 2016లో ఈ చట్టం అమలులోకి రాగా.. 24 లక్షల మద్యపాన సంబంధ కేసులు తగ్గాయని, కనీసం 21 లక్షల గృహహింస కేసులను తప్పించగలిగారని పేర్కొంది. అమెరికాకు చెందిన ద ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు.. జాతీయ కుటుంబ సర్వే 3, 4, 5ల వివరాలను సమీక్షించి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఆ వివరాలు ద లాన్సెట్‌ రీజనల్‌ హెల్త్‌ సౌత్‌ఈస్ట్‌ ఆసియా జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అందులోని వివరాల ప్రకారం.. ‘2016లో చట్టం రాకముందు బిహార్‌లో తరచూ మద్యపానం చేసే పురుషుల సంఖ్య 9.7 శాతం నుంచి 15 శాతానికి పెరిగింది. అదే సమయంలో పొరుగు రాష్ట్రాల్లో అది 7.2 నుంచి 10.3 శాతానికి చేరుకుంది. ఒక్క సారి నిషేధం అమల్లోకి వచ్చాక బిహార్‌లో వారానికి మద్యం సేవించే వారి సంఖ్య 7.8 శాతానికి దిగివచ్చింది. అదే పొరుగు రాష్ట్రాల్లో ఇది 10.4 శాతంగా కొనసాగుతోంది. అంతే కాకుండా మద్యం తీసుకోకపోవడం వల్ల భాగస్వామిపై గృహ, లైంగిక హింస చేయడం కూడా తగ్గిపోయింది. భావోద్వేగపరమైన గృహహింస 4.6 శాతం తగ్గగా.. లైంగిక హింస 3.6 శాతానికి పరిమితమైంది’ అని ఈ అధ్యయనం వెల్లడించింది.

ఆరోగ్య స్థితిపైనా ప్రభావం..

మద్యపాన నిషేధం వల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బరువు తక్కువగా ఉండే పురుషుల సంఖ్య 4 శాతం పెరిగిందని, అదే సమయంలో ఊబకాయుల సంఖ్య 5.6 శాతం తగ్గిందని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. అయితే ఏకపక్షంగా, ఉన్నపాటున మద్యపాన నిషేధం అమలు చేయాలన్నది ఈ అధ్యయనం ఉద్దేశం కాదని వారు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితి, ఆర్థిక, సామాజిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వాలు సముచిత నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ అధ్యయన గణాంకాలు ఆ ప్రక్రియలో ఓ దిక్సూచిలా ఉపయోగపడగలవని అభిప్రాయపడ్డారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని