దేశ యువకుల్లో పెరుగుతున్న క్యాన్సర్‌

క్యాన్సర్‌ బాధితులు తమ జబ్బుపై రెండో అభిప్రాయం కోరేందుకు క్యాన్సర్‌ ముక్త్‌ భారత్‌ ఫౌండేషన్‌ నడుపుతున్న సహాయ కేంద్రానికి కాల్‌ చేసిన వారిలో 20 శాతం మంది 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

Published : 27 May 2024 05:41 IST

దిల్లీ: క్యాన్సర్‌ బాధితులు తమ జబ్బుపై రెండో అభిప్రాయం కోరేందుకు క్యాన్సర్‌ ముక్త్‌ భారత్‌ ఫౌండేషన్‌ నడుపుతున్న సహాయ కేంద్రానికి కాల్‌ చేసిన వారిలో 20 శాతం మంది 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఆంకాలజిస్టుల బృందం ప్రారంభించిన ఈ సంస్థకు మార్చి 1 నుంచి మే 15 మధ్య 1,368 మంది కాల్‌ చేశారని, ఇందులో 40 ఏళ్లలోపు వయసున్న క్యాన్సర్‌ రోగుల్లో 60 శాతం మంది పురుషులే ఉన్నారని పేర్కొంది. ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్, మేరఠ్, ముంబయి, దిల్లీ నుంచి ఫోన్‌ చేసినట్లు చెప్పింది. క్యాన్సర్‌ బాధితులు నేరుగా ప్రముఖ ఆంకాలజిస్టులతో మాట్లాడి సెకెండ్‌ ఒపీనియన్‌ను ఉచితంగా పొందేందుకు వీలుగా ఈ హెల్ప్‌లైన్‌ నంబరు(93555 20202)ను ప్రారంభించారు. ఇది సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తుంది. తమ సమస్య గురించి వివరించడానికి వీడియో కాల్‌ కూడా చేయొచ్చు. క్యాన్సర్‌ ముక్త్‌ భారత్‌ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్న ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్, సీనియర్‌ ఆంకాలజిస్టు డాక్టర్‌ ఆశిష్‌గుప్తా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘మాకు రోజూ వందల కాల్స్‌ వస్తున్నాయి. తల, మెడ, రొమ్ము, పేగు క్యాన్సర్లు ప్రబలంగా వ్యాపిస్తున్నట్లు వీటి ద్వారా మాకు తెలుస్తోంది. అయితే సరైన అవగాహన, పరీక్ష కేంద్రాలు లేకపోవడంతో 60 శాతానికి పైగా క్యాన్సర్లు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో నిర్ధారణ అయిన కేసుల్లో 27 శాతం క్యాన్సర్లు 1 లేదా 2 దశల్లో ఉండగా.. 63 శాతం 3 లేదా 4 దశల్లో ఉన్నాయి. క్యాన్సర్‌ రోగుల్లో 67 శాతం మంది ప్రైవేటు ఆసుపత్రుల్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు మా అధ్యయనంలో తేలింది. దేశంలో పెరుగుతున్న స్థూలకాయం, ఆహారపు అలవాట్లలో మార్పు, ప్రత్యేకంగా అల్ట్రా ప్రాసెస్‌ ఫుడ్‌ వినియోగం, నిశ్చల జీవనశైలి కూడా అధిక క్యాన్సర్లకు కారణం అవుతున్నాయి. యువకులు క్యాన్సర్‌ ప్రమాదాన్ని నివారించడానికి పొగాకు, మద్యం వాడకానికి దూరంగా ఉండాలి. క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం, ముందస్తుగా గుర్తించడం ద్వారా సమాజంపై దీని ప్రభావాన్ని తగ్గించడమే మా లక్ష్యం’’ అని ఆయన వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని