పిల్లలకు ఏదీ చెప్పకండి.. చేసి చూపించండి

పిల్లలు దేన్నైనా గ్రహించడం ద్వారా నేర్చుకుంటారు. వారికి ఓ పనిని ఎలా చేయాలో చెప్పడం కాదు, మీరు చేసి చూపించడం ద్వారానే నేర్పించగలరు.

Published : 27 May 2024 05:46 IST

పిల్లలు దేన్నైనా గ్రహించడం ద్వారా నేర్చుకుంటారు. వారికి ఓ పనిని ఎలా చేయాలో చెప్పడం కాదు, మీరు చేసి చూపించడం ద్వారానే నేర్పించగలరు. మీ పిల్లలు ఎలా జీవించాలని మీరు కోరుకుంటున్నారో, అలాంటి ఆదర్శ జీవితాన్నే మీరు కొనసాగించండి. వారు ఏ విలువలను పాటించాలని మీరు ఆశిస్తున్నారో, వాటిని ముందు మీరు పాటించండి. మీరు మీ భార్యను గౌరవిస్తే, మీ కుమారుడు మహిళలను గౌరవించడం నేర్చుకుంటాడు. ఓ లంచగొండి తండ్రి తన పిల్లలకు కష్టపడి పనిచేయమని చెప్పగలడా?

సాహిల్‌ బ్లూమ్, కంటెంట్‌ క్రియేటర్‌ 


వారంలో మూడు పుస్తకాలు చదివేస్తా..

పత్రికలు చదవడం నాకో వ్యసనం. ఉదయాన్నే పత్రిక రాకుంటే అసహనానికి లోనవుతా. రోజూ నాలుగు పత్రికలు చదువుతా. వారంలో 2-3 పుస్తకాలు సులభంగా చదివేస్తా. ఆత్మకథలూ, చరిత్ర, క్లాసిక్‌ పుస్తకాలు.. ఆసక్తిగా ఉంటే క్రైమ్‌ థ్రిల్లర్స్‌ కూడా ఎంపికచేసుకుంటా. చదివే పుస్తకాలు వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటా.

రస్కిన్‌ బాండ్, రచయిత


ఆర్థిక నిర్వహణ మహిళలకూ సాధ్యమే

ఆర్థిక నిర్వహణలో మహిళల కంటే పురుషులే మెరుగ్గా ఉంటారన్న అపోహ సమాజంలో బలంగా నాటుకుపోయింది. వాస్తవానికి మహిళలు శతాబ్దాల తరబడి ఇంటి ఆర్థిక వ్యవహారాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కబెడుతున్నారు. నాన్న డబ్బు కోసం జేబులు తడుముకుంటున్నప్పుడు అమ్మ పోపులపెట్టెలో భద్రంగా దాచిన పైసలు ఇచ్చి ఆదుకోవడం మనం చూళ్లేదా? ఆర్థిక నిర్వహణకు కావాల్సింది జ్ఞానం తప్ప మహిళనా, పురుషుడా అన్నదాంతో సంబంధం లేదు. అందుకే ఆర్థిక రంగంలోకి ప్రవేశించడానికి మహిళలకు ఇంటినుంచే ప్రోత్సాహం అందాలి.

ప్రీతి రాఠీ గుప్తా, వ్యాపారవేత్త


ఇతరులతో పోల్చుకుంటే అసంతృప్తే..

యువతలో చాలా మంది కుంగుబాటుకు గురవుతూ అసంతృప్తితో జీవిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం సామాజిక   మాధ్యమాల ప్రభావంతో ఇతరుల్లా   జీవించాలని కోరుకోవడమే. తమకు నేరుగా పరిచయం లేనివారు పోస్ట్‌ చేసే ఫొటోలు చూసి వారు విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు భ్రమపడుతున్నారు. వారితో పోల్చుకుంటూ తమ జీవితం  అలా లేదని బాధపడుతున్నారు.   సోషల్‌ మీడియాలో కనిపించినంత   ఆనందంగా ఎవరి జీవితమూ ఉండదని తెలుసుకోవాలి. మనం మనలా బతకాలి తప్ప ఇంకొకరిలా కాదు.

రాధికా గుప్తా, వ్యాపారవేత్త 


పీసా టవర్‌ లాంటిదే మన జీవితం

ఇటలీలోని పీసా టవర్‌ ఒక పక్కకు ఎందుకు ఒరిగిందని ఎప్పుడైనా ఆలోచించారా? దాని నిర్మాణ సమయంలో కచ్చితమైన ఉపకరణాలు లేకపోవడం వల్ల నిర్మాణకర్తలు మృదువైన, అస్థిరమైన మట్టిలో పునాదులు వేయడం వల్లే అంతటి అద్భుత నిర్మాణం ఒరిగింది. మన జీవితానికీ ఈ సూత్రం వర్తిస్తుంది. విలువలు, క్రమశిక్షణతో కూడిన గట్టి పునాదులు ఉంటేనే జీవితం స్థిరంగా ఉంటుంది.

యునెస్కో  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని