దేశవ్యాప్తంగా 10.46 లక్షల పెండింగ్‌ వాహన ప్రమాద బీమా దరఖాస్తులు

దేశవ్యాప్తంగా రూ.80,455 కోట్ల విలువైన 10,46,163 వాహన ప్రమాద బీమా క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు అందిన వివరాలు వెల్లడిస్తున్నాయి.

Published : 27 May 2024 05:48 IST

వాటి విలువ రూ.80,455 కోట్లు
ఆర్టీఐ దరఖాస్తుదారుకు వెల్లడించిన ఐఆర్‌డీఏ

దిల్లీ: దేశవ్యాప్తంగా రూ.80,455 కోట్ల విలువైన 10,46,163 వాహన ప్రమాద బీమా క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు అందిన వివరాలు వెల్లడిస్తున్నాయి. 2018-19 నుంచి 2022-23 మధ్యలో పెండింగ్‌ క్లెయిమ్‌లు మరింత పెరిగాయి. సుప్రీంకోర్టు న్యాయవాది కేసీ.జైన్‌ ఏప్రిల్‌లో చేసిన దరఖాస్తుకు స్పందిస్తూ భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఈ వివరాలను అందించింది. అలాగే రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖకు పంపిన మరో దరఖాస్తులో.. దేశంలో రాష్ట్రాలు, జిల్లాల వారీగా ఎన్ని పెండింగ్‌ క్లెయిమ్‌లు ఉన్నాయో తెలియజేయాలని జైన్‌ కోరారు. ఆర్టీఐ ఇచ్చిన సమాచారంపై ఆయన స్పందిస్తూ.. పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌ల సంఖ్య ఏటికేడు పెరుగుతున్నాయన్నారు. ప్రమాదాల్లో మరణించిన, గాయపడిన వారికి క్లెయిమ్‌లు అందడంలో జాప్యం జరుగుతోందని, అర్హులకు పూర్తి క్లెయిమ్‌లను చెల్లించడానికి సుమారు నాలుగేళ్ల సమయం పడుతోందని తెలిపారు. పరిహారం చెల్లింపుల్లో జాప్యాన్ని పరిగణనలోకి తీసుకుని మధ్యంతర చెల్లింపు జరిగేలా సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్లు జైన్‌ తెలిపారు. బాధితులకు మోటార్‌ వాహనాల చట్టంలోని సెక్షన్‌ 164ఎ కింద కేంద్ర ప్రభుత్వం మధ్యంతర చెల్లింపులు జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు