అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయి: స్వాతి మాలీవాల్‌

ఆప్‌ నేతలు తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌ ఆరోపించారు. దీనివల్ల తనకు అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 27 May 2024 05:49 IST

దిల్లీ: ఆప్‌ నేతలు తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌ ఆరోపించారు. దీనివల్ల తనకు అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూట్యూబర్‌ ధ్రువ్‌ రాథీ తనకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో వీడియోలను పోస్టు చేసినప్పటి నుంచీ  బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయన్నారు. ‘‘స్వతంత్ర జర్నలిస్టులమని చెప్పుకొనే ఇలాంటి వ్యక్తులు ఆప్‌ ప్రతినిధుల్లా ప్రవర్తించడం సిగ్గుచేటు. ప్రస్తుతం నేను అన్నివైపుల నుంచి అసత్య ప్రచారాలు, తీవ్ర బెదిరింపులు ఎదుర్కొంటున్నా’’ అని మాలీవాల్‌ ఆదివారం ‘ఎక్స్‌’ ఖాతాలో పేర్కొన్నారు. తన ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేసేందుకే పార్టీ నాయకత్వం ఈ విధంగా బెదిరింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ధ్రువ్‌ను కలిసి తన వాదన వినిపిద్దామంటే.. అతడు తన ఫోన్‌కాల్స్‌కు స్పందించడం లేదన్నారు. పార్టీ యంత్రాంగం తనతో ప్రవర్తిస్తున్న తీరు మహిళల సమస్యలపై వారి వైఖరిని తెలియజేస్తోందన్నారు. తనకు వస్తున్న బెదిరింపులపై పోలీసులు కఠినచర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో మే 13న మాలీవాల్‌పై జరిగిన దాడి కేసులో సీఎం సహాయకుడు బిభవ్‌ కుమార్‌ను పోలీసులు మే 18న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెయిలు కోరుతూ బిభవ్‌ శనివారం స్థానిక కోర్టును ఆశ్రయించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని