సంక్షిప్త వార్తలు (8)

నేను, నా సతీమణి అక్షతా మూర్తి కలిసి  ఎక్కడికి వెళ్లినా ఇతరుల నుంచి ఎదురయ్యే మొదటి ప్రశ్న.. మీలో ఉండే ఉమ్మడి విషయం ఏంటి? అని. దాంపత్య జీవితంలో కలిసి సినిమాలు చూడడం, నచ్చిన ఆహారాన్ని తినడం మాత్రమే కాదు.

Updated : 28 May 2024 05:11 IST

భార్యాభర్తలు విలువలను కూడా పంచుకోవాలి

నేను, నా సతీమణి అక్షతా మూర్తి కలిసి  ఎక్కడికి వెళ్లినా ఇతరుల నుంచి ఎదురయ్యే మొదటి ప్రశ్న.. మీలో ఉండే ఉమ్మడి విషయం ఏంటి? అని. దాంపత్య జీవితంలో కలిసి సినిమాలు చూడడం, నచ్చిన ఆహారాన్ని తినడం మాత్రమే కాదు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఒకే విధమైన విలువలకు  కట్టుబడి ఉండడం. జీవితంలో ఏ స్థాయిలో ఉండాలో మన కష్టమే నిర్ణయిస్తుంది. దాన్నే మేమిద్దరం విశ్వసిస్తాం. ఏదైనా మార్పు సాధించాలంటే మాత్రం సాహసోపేతమైన నిర్ణయాలు అవసరమనే విషయంలోనూ ఇద్దరిదీ ఒకటే మాట. దాని ఫలితంగా మనకంటే మెరుగైన ప్రపంచాన్ని మన పిల్లలు వారసత్వంగా పొందుతారని మా విశ్వాసం. 

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ 


వేసవి తాపం.. ప్రభుత్వాలదే పాపం

ఎండలకు తాళలేకపోతున్నవారు వేసవి కాలాన్ని నిందించకండి. కేంద్రంలో వచ్చిన ప్రభుత్వాలు వృక్ష సంపదను పెంచడంలో ఘోరంగా విఫలమయ్యాయన్న వాస్తవాన్ని తెలుసుకోండి. ప్రపంచంలో సగటున ఒక్కో మనిషికి 422 చెట్లు ఉన్నాయి. కెనడాలో సగటున 10,163 వృక్షాలు, ఆస్ట్రేలియాలో 3266, అమెరికాలో 699, చైనాలో 130 ఉంటే భారత్‌లో 28 మాత్రమే ఉన్నాయి.

జవహర్‌ సర్కార్, తృణమూల్‌ రాజ్యసభ ఎంపీ 


ఇతరుల తప్పుల నుంచి నేర్చుకోవడమే ఉత్తమం 

మన తప్పుల నుంచి నేర్చుకొనే పరిస్థితి వస్తే అది బాధాకరంగా ఉంటుంది. దానికన్నా ముందే ఇతరుల తప్పుల నుంచి నేర్చుకోవడం ఉత్తమం. అనారోగ్యకరమైన తిండి వల్ల ఆరోగ్యం దెబ్బతిన్నవారిని చూసి కూడా చాలా మంది జాగ్రత్తపడరు. తాము అనారోగ్యం బారినపడిన తర్వాతే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మొదలుపెడతారు. మీకు క్రమశిక్షణ, ఇతరుల తప్పుల నుంచి నేర్చుకునే గుణం ఉంటే మీ జీవితం సాఫీగా సాగుతుంది.

మనోజ్‌ అరోడా, రచయిత


పిల్లలను శిక్షించడం అతిపెద్ద తప్పు

పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు శిక్షించడం అతి పెద్ద తప్పు. శిక్ష ద్వారా పిల్లలు తమ తప్పు తెలుసుకోకపోగా, తల్లిదండ్రులపై ద్వేషాన్ని పెంచుకుంటారు. భవిష్యత్తులో తమ తప్పులు తల్లిదండ్రులకు తెలియకుండా దాచడానికి అబద్ధాలు చెప్పడంతోపాటు మొండివారిగా మారే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు అనునయంగా పిల్లల తప్పులను సరిదిద్దాలి. ఏం చేసి ఉంటే బాగుండేదో వివరించి చెప్పాలి. అప్పుడే వారిలో మార్పు వస్తుంది.

ల్యూక్‌ అడిస్ట్, పేరెంటింగ్‌ కోచ్‌


సంపద సృష్టి దేశవ్యాప్తంగా జరగాలి!

ఇండియా జీడీపీలో సగం 13 జిల్లాలు/నగరాల్లోనే కేంద్రీకృతమై ఉంది(మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ 2020-21 లెక్కల ప్రకారం). భవిష్యత్తులో సంపద సృష్టి, పంపిణీని భౌగోళికంగా విస్తరించాలి. అప్పుడే వలసలు ఆగుతాయి, అన్ని ప్రాంతాల ప్రజలూ ఆత్మవిశ్వాసంతో ఉంటారు. తద్వారా జాతీయ సమగ్రత సాధ్యమవుతుంది.

పంకజ్‌ పచౌరీ, జర్నలిస్ట్‌


పోలీస్‌ కస్టడీకి దిల్లీ ఆసుపత్రి యజమాని

దిల్లీ: నిబంధనల ఉల్లంఘనతో పాటు అనుమతుల్లేకుండా ఆసుపత్రిని నడుపుతూ ఏడుగురు చిన్నారుల మృతికి కారణమైన దిల్లీలోని బేబీకేర్‌ హాస్పిటల్‌ యజమానిని న్యాయస్థానం సోమవారం పోలీస్‌ రిమాండ్‌కు అనుమతించింది. ఆసుపత్రి యజమాని డాక్టర్‌ నవీన్‌ ఖిచితో పాటు ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న డాక్టర్‌ ఆకాశ్‌ కూడా మూడు రోజుల పాటు కస్టడీలో ఉంటారు. దీనికి సంబంధించిన ఉత్తర్వును చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ విధి గుప్తా ఆనంద్‌ జారీ చేశారు. నిందితులు ఇద్దరినీ దిల్లీ పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తూర్పు దిల్లీలోని వివేక్‌విహార్‌లో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు ఆహుతి కాగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు.


ఆన్‌లైన్‌లో రైల్వే ఉద్యోగుల విచారణకు అనుమతి

ఈనాడు, దిల్లీ: రైల్వే ఉద్యోగులపై తీసుకునే క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన విచారణను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చేపట్టేందుకు రైల్వేశాఖ అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి కొత్తగా రైల్వే సర్వెంట్స్‌ (కండక్ట్‌ ఆఫ్‌ డిసిప్లినరీ ఎంక్వయిరీ త్రూ వీడియో కాన్ఫరెన్స్‌) రెగ్యులేషన్స్‌ 2024 పేరుతో కొత్త నిబంధనలను జారీ చేస్తూ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రైల్వే సర్వెంట్స్‌ (డిసిప్లిన్‌ అండ్‌ అప్పీల్‌) రూల్స్‌ 1968 ప్రకారం ఇప్పటివరకు జరుగుతూ వచ్చిన డిపార్ట్‌మెంటల్‌ విచారణలను ఇకనుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొనసాగించడానికి వీలవుతుంది. ఎంక్వయిరీ అథారిటీ అనుమతిచ్చిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా మాత్రమే దీన్ని చేపట్టాల్సి ఉంటుంది. ఈ విచారణ ప్రక్రియను మొత్తం రికార్డు చేసి భద్రపరచనున్నారు. 


వేసవిలో నల్లకోటు నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థన

దిల్లీ: ఎండాకాలంలో న్యాయవాదులు నల్లకోటు వేసుకోవడం నుంచి మినహాయింపు ఇవ్వాలని సుప్రీంకోర్టులో శైలేంద్ర మణి త్రిపాఠి అనే అడ్వొకేట్‌ సోమవారం ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అపెక్స్‌ న్యాయస్థానాలతోపాటు హైకోర్టులకూ దీన్ని వర్తింపజేయాలని ఆయన కోరారు. వేసవి సమయాన్ని నిర్దేశించేందుకు దేశంలోని అన్ని ‘స్టేట్‌ బార్‌ కౌన్సిళ్ల’ నుంచి అభిప్రాయాన్ని సేకరించాలని సూచించారు. 2022లోనూ ఇదే తరహా అభ్యర్థనతో ఓ పిటిషన్‌ దాఖలు కాగా.. సుప్రీంకోర్టు సున్నితంగా తిరస్కరించింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని