పద్మ అవార్డును తిరిగిచ్చేస్తా

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపుర్‌ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు హేమచంద్‌ మాంఝీ (72)కి నక్సలైట్ల నుంచి బెదిరింపులు రావడంతో పద్మ అవార్డును వెనక్కు ఇచ్చేస్తానని సోమవారం ఆయన ప్రకటించారు.

Published : 28 May 2024 04:49 IST

నక్సలైట్ల బెదిరింపులతో ఛత్తీస్‌గఢ్‌ వైద్యుడు మాంఝీ ప్రకటన

నారాయణపుర్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపుర్‌ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు హేమచంద్‌ మాంఝీ (72)కి నక్సలైట్ల నుంచి బెదిరింపులు రావడంతో పద్మ అవార్డును వెనక్కు ఇచ్చేస్తానని సోమవారం ఆయన ప్రకటించారు. వైద్యరాజ్‌గా పేరొందిన మాంఝీ తన వృత్తిని కూడా వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. గత నెలలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈయన పద్మశ్రీ అవార్డు అందుకొన్నారు. ఛోటేడోంగర్‌ పోలీస్‌స్టేషను పరిధిలో నిర్మాణంలో రెండు సెల్‌టవర్లను ఆదివారం రాత్రి పేల్చివేసిన నక్సలైట్లు మాంఝీని బెదిరిస్తూ కరపత్రాలు వదిలి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కరపత్రాల్లో మాంఝీ పద్మశ్రీ అందుకొంటున్న చిత్రాన్ని ప్రచురించిన నక్సలైట్లు.. ఆమదాయీ ఘాటీ ఇనుప ఖనిజ ప్రాజెక్టు ప్రారంభంలో సహకరించిన మాంఝీ అందుకు బదులుగా భారీఎత్తున ముడుపులు అందుకొన్నట్లు ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ ఈ ఆరోపణలను ఖండించిన మాంఝీ ఆ ప్రాజెక్టుతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఇదివరకే స్పష్టం చేసినట్లు తెలిపారు. 20 ఏళ్ల వయసు నుంచీ తాను ప్రజలకు ఆయుర్వేద వైద్యం అందిస్తున్నాననీ, ప్రత్యేకంగా క్యాన్సర్‌కు ఎంతోమందికి వైద్యం చేశానన్నారు. గతేడాది తన బంధువును కూడా నక్సలైట్లు చంపేశారని, ఇపుడు తన కుటుంబం భయంతో బతుకుతోందని మాంఝీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని