రాత్రుల్లోనూ చల్లబడని మహానగరాలు

పెరుగుతున్న కాంక్రీటీకరణ, గాలిలో తేమ స్థాయులు దేశంలోని మహానగరాల్లో వేడిని పెంచుతున్నాయని, దశాబ్ద క్రితంనాటితో పోలిస్తే ఇప్పుడు రాత్రిపూట కూడా ఇవి చల్లబడటం లేదని ‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ (సీఎస్‌ఈ) తాజా నివేదిక తెలిపింది.

Updated : 29 May 2024 07:51 IST

పగటి ఉష్ణోగ్రతల్లాగే ఇదీ ప్రమాదకరం 
దిల్లీ, హైదరాబాద్‌ సహా మెట్రోల్లో ఇదే పరిస్థితి 
వెల్లడించిన సీఎస్‌ఈ నివేదిక 
రాత్రిపూట వేడి 60% అధికం: ఐఐటీ భువనేశ్వర్‌ 

దిల్లీ: పెరుగుతున్న కాంక్రీటీకరణ, గాలిలో తేమ స్థాయులు దేశంలోని మహానగరాల్లో వేడిని పెంచుతున్నాయని, దశాబ్ద క్రితంనాటితో పోలిస్తే ఇప్పుడు రాత్రిపూట కూడా ఇవి చల్లబడటం లేదని ‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ (సీఎస్‌ఈ) తాజా నివేదిక తెలిపింది. జనవరి 2001 నుంచి ఏప్రిల్‌ 2024 వరకు ఆరు మహా నగరాలు- దిల్లీ, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో వేసవి తీవ్రతను దీనిలో విశ్లేషించింది. గాలివేడి, భూమి ఉపరితల ఉష్ణోగ్రత, గాలిలో తేమకు సంబంధించిన గణాంకాలను పరిగణనలో తీసుకుంది. ‘పెరిగిన తేమ.. అన్ని వాతావరణ జోన్లలో వేడిని మరింత తీవ్రతరం చేస్తోంది. దిల్లీ, హైదరాబాద్‌లలో ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గడానికి కూడా వీలుండటం లేదు. బెంగళూరు మినహా మిగిలిన ఐదు మహా నగరాల్లో 2001-10 సగటుతో పోలిస్తే 2014-2023 మధ్య వేసవికాల తేమ సగటున 5-10 శాతం పెరిగింది. 2001-10 మధ్య ఉష్ణోగ్రతలు రాత్రిపూట 6.20-13.20 డిగ్రీల సెల్సియస్‌ మేర తగ్గేవి. 2014-2023 మధ్య 6.20-11.50 డిగ్రీలు మాత్రమే తగ్గింది. పగటి ఉష్ణోగ్రతల మాదిరే వేడిరాత్రులు ప్రమాదకరమైనవి. ఆరు నగరాల్లో రుతుపవనాల కాలాలు గతంలో కంటే వేడిగా ఉంటున్నాయి. పచ్చదనం తగ్గింది. కోల్‌కతాలో అది మరీ అత్యల్పంగా ఉంది’ అని సీఎస్‌ఈ వివరించింది. 

కాంక్రీటు, తారు ప్రధాన కారణం 

పట్టణేతర ప్రాంతాలతో పోలిస్తే 140కి పైగా నగరాలు దాదాపు 60% ఎక్కువగా రాత్రిపూట వేడిని ఎదుర్కొంటున్నాయని భువనేశ్వర్‌ ఐఐటీ తాజా పరిశోధనలో తెలిపింది. కాంక్రీటు, తారు కలిగిన ఉపరితలాలు పగటిపూట వేడిని నిల్వ చేసుకొని సాయంత్రం విడుదల చేస్తాయి. తద్వారా రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దేశంలోని ఇతర ప్రాంతాల కంటే వాయవ్య, ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లోని నగరాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తోంది. దేశం మొత్తం వేడెక్కుతున్న రేటు కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో నగరాలు వేడెక్కుతున్నాయని ఐఐటీ వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు