ప్రధాన న్యాయమూర్తి ముందుకు కేజ్రీవాల్‌ బెయిల్‌ పొడిగింపు అభ్యర్థన

ఆరోగ్య పరీక్షల నిమిత్తం తన మధ్యంతర బెయిల్‌ గడువును పొడిగించాలన్న దిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అభ్యర్థన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ముందుకు వెళ్లనుంది.

Published : 29 May 2024 03:54 IST

అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తిరస్కరణ

దిల్లీ: ఆరోగ్య పరీక్షల నిమిత్తం తన మధ్యంతర బెయిల్‌ గడువును పొడిగించాలన్న దిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అభ్యర్థన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ముందుకు వెళ్లనుంది. బెయిల్‌ పొడిగింపు పిటిషన్‌ను అత్యవసర విచారణ జాబితాలో చేర్చేందుకు జస్టిస్‌ జె.కె.మహేశ్వరి, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన సెలవు కాలీన ధర్మాసనం మంగళవారం నిరాకరించింది. అంతేకాకుండా... కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం ముందు గత వారం ఈ అభ్యర్థనను ఎందుకు ప్రస్తావించలేదని ఆప్‌ నేత తరఫు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్విని ప్రశ్నించింది. ‘ఈ పిటిషన్‌పై సీజేఐ నిర్ణయం తీసుకోవడమే సముచితం. ఆయన వద్దకు దీనిని పంపిస్తున్నాం’ అని ధర్మాసనం తెలిపింది. కేజ్రీవాల్‌కు ఆరోగ్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందన్న వైద్యుడి సూచనలు రెండు రోజుల క్రితమే అందినందున జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లడం సాధ్యం కాలేదని సింఘ్వి తెలిపారు. వర్చువల్‌ విధానంలో అయినా సరే ఆ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్తామంటే అభ్యంతరం లేదని సింఘ్వి చెప్పారు. ప్రధాన పిటిషన్‌పై తీర్పు రిజర్వులో ఉన్నందున బెయిల్‌ పొడిగింపు అభ్యర్థన లిస్టింగ్‌పై సీజేఐ నిర్ణయం తీసుకుంటారని జస్టిస్‌ జె.కె.మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్‌ తన పిటిషన్‌లో కోరారు. జూన్‌ 9న జైలుకు వెళ్లి లొంగిపోతానని పేర్కొన్నారు. తొలుత విధించిన గడువు జూన్‌ 2న ముగుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని