వాహనదారులపైకి దూసుకెళ్లిన బ్రిజ్‌భూషణ్‌ తనయుడి కాన్వాయ్‌

మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణలతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న భాజపా ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

Published : 30 May 2024 04:25 IST

యూపీలో ఇద్దరు యువకుల మృతి
మరో మహిళకు గాయాలు
కేసు నమోదు చేసిన పోలీసులు

గోండా: మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణలతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న భాజపా ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆయన తనయుడు, కైసర్‌గంజ్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి కరణ్‌ భూషణ్‌ సింగ్‌ కాన్వాయ్‌లోని కారు వాహనదారులపైకి దూసుకెళ్లింది. దాంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళ గాయపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా నగర సమీపంలోని రహదారిపై బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ కైసర్‌గంజ్‌ సిటింగ్‌ ఎంపీగా ఉన్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈసారి భాజపా ఆయనకు టికెట్‌ ఇవ్వకుండా ఆయన కుమారుడికి ఇచ్చింది. 

ప్రమాద ఘటనలో నిందిత డ్రైవర్‌ లవ్‌కుశ్‌ శ్రీవాస్తవను పోలీసులు అరెస్టు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన మహిళను ఆసుపత్రిలో చేర్చారు. మృతులను రెహాన్‌ ఖాన్‌ (17), షెహజద్‌ ఖాన్‌ (20)గా గుర్తించారు. వారిద్దరూ మోటారు సైకిల్‌పై వెళ్తుండగా ఓ పాఠశాల వద్ద ఎస్‌యూవీ వారి బైకును ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. అదుపు తప్పిన ఆ వాహనం ఆ మార్గంలోనే నడిచి వెళ్తున్న సీతాదేవి (60) అనే మహిళనూ ఢీకొట్టింది. ప్రమాదానికి కారణమైన వాహనం కరణ్‌సింగ్‌ వాహనశ్రేణిలోనిదని స్థానికులు ఆరోపించారు. అందులోని వ్యక్తులు ఆ వాహనాన్ని వదిలి మరో వాహనంలో వెళ్లిపోయారని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కరణ్‌ ఆ కాన్వాయ్‌లో ఉన్నారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. సంఘటన నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు, వారి బంధువులు ఆ రహదారిని దిగ్బంధించారు. పోలీసులు వారికి నచ్చచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి యువకుల మృతదేహాలను పోస్టుమార్టానికి పంపారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. 

బయటపడిన కరణ్‌ నేరపూరిత ప్రవర్తన: తృణమూల్‌ కాంగ్రెస్‌ 

తాజా ఘటనపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎక్స్‌ వేదికగా విమర్శలు చేసింది. ‘‘తండ్రి మాదిరిగానే కుమారుడు కూడా నేరపూరిత లక్షణాలను ప్రదర్శించారు. కాన్వాయ్‌తో ఢీకొట్టడం ద్వారా బ్రిజ్‌భూషణ్‌ కుమారుడు ఒక అడుగు ముందుకు వేశారు. నేరపూరిత ప్రవర్తనను ఈ ఘటన వెల్లడిచేస్తోంది’’ అని దుయ్యబట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని