తీవ్ర ఉష్ణ‘మే’!

పెను ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయి. అత్యంత ఉష్ణమయ నెలగా గడిచిన మే నిలిచింది. దీంతో వరుసగా 12 నెలల పాటు ఈ పోకడ కొనసాగినట్లయింది.

Published : 06 Jun 2024 06:36 IST

గత నెలలోనూ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

దిల్లీ: పెను ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయి. అత్యంత ఉష్ణమయ నెలగా గడిచిన మే నిలిచింది. దీంతో వరుసగా 12 నెలల పాటు ఈ పోకడ కొనసాగినట్లయింది. చారిత్రకంగా ఆయా నెలలకు సంబంధించిన సరాసరి ఉష్ణోగ్రతల్లో రికార్డులు బద్దలయ్యాయి. గత ఏడాది జూన్‌ నుంచి ఇది కొనసాగుతోంది. ఈ ఏడాది మేలో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలను తీవ్రస్థాయి వేడిమి, వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఎల్‌నినో వాతావరణ పోకడతోపాటు మానవ చర్యల వల్ల చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులే ఇందుకు కారణమని ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సర్వీసెస్‌ (సీ3ఎస్‌) తెలిపింది. ఈ ఏడాది మే నెలలో పుడమి సరాసరి ఉష్ణోగ్రతలు.. పారిశ్రామికీకరణకు ముందు (1850-1900) నాటితో పోలిస్తే 1.52 డిగ్రీల సెల్సియస్‌ మేర అధికంగా ఉన్నట్లు వివరించింది. అయితే ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితేనే పారిస్‌ ఒప్పందంలో పేర్కొన్న 1.5 డిగ్రీల సెల్సియస్‌ పరిమితిని మించిపోయినట్లు భావిస్తారు. గత ఏడాది జూన్‌ నుంచి ఈ ఏడాది మే మధ్య 12 నెలల సరాసరి భూ ఉష్ణోగ్రతల్లోనూ రికార్డు నమోదైంది. 1991 నుంచి 2020 మధ్యనాటి సరాసరితో పోలిస్తే ఇది 0.75 డిగ్రీల సెల్సియస్‌ అధికం. పారిశ్రామికీకరణకు ముందునాటి కంటే ఇది 1.63 డిగ్రీల సెల్సియస్‌ మేర ఎక్కువ. 


2028 నాటికి 1.5 డిగ్రీలు పెరగనున్న భూతాపం 

దిల్లీ: పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే వచ్చే ఐదేళ్లలో ఏదో ఒక ఏడాది భూతాపంలో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌ దాటిపోవడానికి 80 శాతం మేర అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) బుధవారం తెలిపింది. ఈ ఐదేళ్లలో ఒక ఏడాది.. 2023లో నమోదైన ఉష్ణోగ్రతల రికార్డు బద్ధలు కావడానికి 86 శాతం అవకాశం ఉందని వివరించింది. అయితే 2024-28 మధ్యకాలంలో ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌ కొనసాగడానికి 47 శాతం అవకాశం ఉందని తెలిపింది. 2023-27 మధ్య కాలంలో ఇందుకు ఒక శాతం మేర అవకాశం ఉందని గత ఏడాది డబ్ల్యూఎంవో ఇచ్చిన నివేదిక పేర్కొంది. తాజా నివేదిక ప్రకారం.. 1850-1900 మధ్యనాటితో పోలిస్తే 2024-2028 మధ్యకాలంలో భూ ఉపరితలానికి చేరువలోని వాతావరణంలోని సరాసరి ఉష్ణోగ్రత 1.1 నుంచి 1.9 డిగ్రీల సెల్సియస్‌ మేర అధికంగా ఉండొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని