ఎన్నికల ఫలితాలు నేర్పుతున్న జీవిత పాఠాలు

లోక్‌సభ ఎన్నికల ఫలితాల నుంచి నేర్చుకోవాల్సిన ఆరు జీవిత పాఠాలు: 1.అతి విశ్వాసంతో మిమ్మల్ని మీరు అలక్ష్యం చేసుకుంటూ(భాజపాలాగా) ఉన్నచోటే ఆగిపోకండి.

Published : 07 Jun 2024 05:10 IST

లోక్‌సభ ఎన్నికల ఫలితాల నుంచి నేర్చుకోవాల్సిన ఆరు జీవిత పాఠాలు:

1.అతి విశ్వాసంతో మిమ్మల్ని మీరు అలక్ష్యం చేసుకుంటూ(భాజపాలాగా) ఉన్నచోటే ఆగిపోకండి. మీరు అత్యుత్తమం అయినప్పటికీ నిరంతరం మెరుగుపర్చుకోవాలి.

2.జీవితంలో మీ నియంత్రణలో లేని అంశాలు(కులమతాల ఆధారిత ఓట్లు) కొన్ని ఉంటాయి. వాటిని మార్చాలని ఎంత ప్రయత్నించినా ఉపయోగముండదు.

3.ఓడిపోండి. ఓటమి నుంచి నేర్చుకోండి. కానీ ఎప్పుడూ ప్రయత్నాన్ని వదలొద్దు(ప్రతిపక్షాల తరహాలో). ఏదోరోజు ఫలితం దక్కుతుంది.

4. మీ విశ్వసనీయతతో సంబంధం లేకుండా.. కొన్నిసార్లు అనూహ్యంగా ఓటమి చవిచూడాల్సి వస్తుంది. డీలా పడకుండా ముందుకెళ్లండి.

5. కఠినమైన పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు ఇతర వ్యక్తుల సాయం తీసుకోండి. బృందంగా ఏర్పడండి(కాంగ్రెస్‌ బలహీనంగా ఉన్నచోట ఇతర పార్టీలను కలుపుకొన్నట్లు).

6.కాలాన్ని బట్టి వ్యూహాలను, విధానాలను మార్చుకోవాలి. (నేటి రోజుల్లో అభివృద్ధికే ప్రజల ప్రాధాన్యం).

హిమాన్షు త్యాగి, ఐఎఫ్‌ఎస్‌ అధికారి


సర్కారుపై గ్రామీణ ఓటరు అసంతృప్తి

ఈ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల పరిధిలోని 344 లోక్‌సభ నియోజకవర్గాల్లో  159 చోట్ల ఓటర్లు మార్పు కోరుకుని కొత్త అభ్యర్థిని ఎన్నుకున్నారు. నోట్ల రద్దు  మొదలుకొని, ఉన్నపళంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికుల ఇబ్బందులను పట్టించుకోకపోవడం, గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల్లో కోత  విధించడం ఇత్యాది కారణాలతో మోదీ సర్కారు 400 సీట్ల కల కల్లగా మారింది.

సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి


వాటిని ఇంటి బయటే వదిలి వెళ్లండి

మన వృత్తి జీవితంలో ఒత్తిడి, చిరాకు, కోపం, నిరాశ, ఆందోళన కలిగించే సందర్భాలు తరచూ ఎదురవుతుంటాయి. ఈ ప్రతికూల భావనలను ఎదుర్కోవడం తప్పనిసరి. అయితే వీటిని అలాగే  మోసుకుంటూ ఇంటికి తీసుకెళ్తే వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడుతుంది. ఇంటికి వెళ్లగానే పాదరక్షలను బయట ఎలా వదిలేసి వెళ్తామో, వాటిని కూడా బయటే విడిచిపెట్టి వెళ్లాలి. సంపూర్ణ శారీరక,   మానసిక విశ్రాంతి పొందడానికి అది అవసరం. అప్పుడే నూతనోత్తేజంతో    మళ్లీ ఉద్యోగానికి వెళ్లగలం.

గౌర్‌ గోపాల్‌ దాస్, ఆధ్యాత్మికవేత్త


గాజాలో ఓ తరాన్ని వికలాంగులుగా మారుస్తున్న యుద్ధం

యుద్ధం కారణంగా గాజాలో పెద్ద  ఎత్తున పౌరులు మరణిస్తుండటం ఓ  విషాదమైతే, చిన్నారులు అవయవాలు కోల్పోయి వికలాంగులుగా మారుతుండటం తీవ్ర ఆందోళనకరం. రోజుకు సగటున  10 మంది పిల్లలు అవయవాలు కోల్పోతున్నట్లు యునిసెఫ్‌ పేర్కొంది. దీనివల్ల  భవిష్యత్తు తరంపై తీవ్ర ప్రభావం పడబోతోంది. ఆసుపత్రుల మూసివేత కారణంగా దాడుల్లో గాయపడినవారికి సత్వరం  చికిత్స అందించే అవకాశం లేకపోవడం వల్ల  అవయవాలు తొలగించాల్సిన    పరిస్థితి తలెత్తుతోంది.

ఇబ్రహీం, గాజాలోని వైద్యుడు


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని