సంక్షిప్త వార్తలు (3)

పరిహారం చెల్లించారన్న కారణంతో శిక్ష తగ్గించే విధానం తీసుకొస్తే నేర న్యాయవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టం నుంచి ధనవంతులైన నిందితులు తప్పించుకొనే అవకాశం ఉంటుందని తెలిపింది.

Updated : 07 Jun 2024 07:00 IST

పరిహారం చెల్లించారని శిక్ష తగ్గించకూడదు
అలా చేస్తే ధనవంతులైన నిందితులు చట్టం నుంచి తప్పించుకుంటారు: సుప్రీం

దిల్లీ: పరిహారం చెల్లించారన్న కారణంతో శిక్ష తగ్గించే విధానం తీసుకొస్తే నేర న్యాయవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టం నుంచి ధనవంతులైన నిందితులు తప్పించుకొనే అవకాశం ఉంటుందని తెలిపింది. శిక్ష వేరు, పరిహారం వేరని ఈ రెండింటిని కలపకూడదని స్పష్టం చేసింది. ‘‘పరిహారం ప్రధాన ఉద్దేశం.. క్రిమినల్‌ కేసులో నష్టానికి లేదా గాయానికి గురైన వారిని యథాస్థితి స్థానానికి తేవడం. నిందితుడికి శిక్ష తగ్గించడానికి ఇది ఎంతమాత్రం కారణం కాకూడదు. అలా చేస్తే.. భారీగా డబ్బు ఉన్న నేరస్థులు చట్టం నుంచి తప్పించుకుంటారు. దీంతో నేర న్యాయ ప్రక్రియ ఉద్దేశమే దెబ్బతింటుంది’’ అని ఓ కేసులో జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా ధర్మాసనం పేర్కొంది.


చైనీయుల వీసా కుంభకోణం కేసులోకార్తీ చిదంబరానికి బెయిల్‌

దిల్లీ: మనీలాండరింగ్‌తో ముడిపడిన చైనీయుల వీసా కుంభకోణం కేసులో కాంగ్రెస్‌ నాయకుడు కార్తీ చిదంబరానికి ఊరట లభించింది. దిల్లీలోని ప్రత్యేక కోర్టు గురువారం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత బాండుతో పాటు అంతే మొత్తానికి పూచీకత్తు సమర్పించే షరతుతో జడ్జి కావేరీ బవేజా బెయిల్‌ ఇచ్చారు. పి.చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న 2011లో 263 మంది చైనీయులకు వీసాలు మంజూరు కావడం వెనుక భారీగా నగదు చేతులు మారిందని, అందులో కార్తీ చిదంబరం ప్రమేయం ఉందంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అభియోగపత్రం దాఖలు చేయగా ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. దీనికి అనుగుణంగా కార్తీ చిదంబరం గురువారం కోర్టుకు హాజరయ్యారు. 


18వ లోక్‌సభ ఎంపీ అభ్యర్థుల సగటు వయసు 56: పీఆర్‌ఎస్‌

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన వారి సగటు వయసు 56 ఏళ్లని పీఆర్‌ఎస్‌ సంస్థ వెల్లడించింది. గత లోక్‌సభలో ఇది 59గా ఉండేదని పేర్కొంది. గెలిచిన ఎంపీల్లో 40 లేదా అంతకన్నా తక్కువ వయసు కలిగిన వారు 11శాతం మంది, 41-55 ఏళ్ల మధ్య 38శాతం మంది ఉన్నారని తెలిపింది. 55 ఏళ్లు పైబడిన వారు 52శాతం ఉన్నారని పేర్కొంది. గెలిచిన వారిలో సమాజ్‌ వాదీ పార్టీకి చెందిన పుష్పేంద్ర సరోజ్‌(25), ప్రియా సరోజ్‌(25) వయసు రీత్యా చిన్నవారని, డీఎంకే పార్టీకి చెందిన టీ.ఆర్‌ బాలు(85) పెద్దవారని సంస్థ తెలిపింది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని