కొత్త లోక్‌సభ సభ్యుల జాబితాను రాష్ట్రపతికి సమర్పించిన ఈసీ

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్, ఎన్నికల కమిషనర్లు- సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, జ్ఞానేశ్‌ కుమార్‌ గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించారు.

Updated : 07 Jun 2024 06:59 IST

ఎన్నికల నిర్వహణ తీరుకు ముర్ము కితాబు

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్, ఎన్నికల కమిషనర్లు- సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, జ్ఞానేశ్‌ కుమార్‌ గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించారు. వారంతా రాష్ట్రపతి భవన్‌లో ఆమెతో భేటీ అయ్యారు. 18వ లోక్‌సభ ఏర్పాటులో భాగంగా వారు నూతన సభ్యుల జాబితాను అందజేశారు. మానవ చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారంటూ సీఈసీని, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి అభినందించారు. స్వేచ్ఛగా, నిజాయతీగా ఎన్నికల్ని నిర్వహించి, ప్రజా బ్యాలెట్‌కు ఉన్న పవిత్రతను నిలబెట్టారని కొనియాడారు. ఈసీ కృషిని, దానిలోని అధికారులు, సిబ్బందిని, పోలీసులు సహా కేంద్ర-రాష్ట్ర భద్రతా బలగాలు అవిశ్రాంతంగా అందించిన సేవల్ని యావద్దేశం తరఫున ఆమె కొనియాడినట్లు ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. కోట్లమంది ఓటర్లు ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ద్వారా బలమైన, చెక్కుచెదరని ప్రజాస్వామ్య సంప్రదాయాలను నిలబెట్టినట్లయిందని పేర్కొంటూ వారికి ఆమె అభినందనలు తెలిపారు. 

ముగిసిన ఎన్నికల ప్రవర్తన నియమావళి

మార్చి 16వ తేదీ నుంచి అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తన నియమావళి గురువారం సాయంత్రంతో ముగిసిందని ఈసీ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని