పార్లమెంటు భవనం ఆవరణ నుంచి గాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాల తరలింపు దారుణ చర్య : విపక్షాలు

పార్లమెంటు భవనం సుందరీకరణ చర్యల్లో భాగంగా దాని ఆవరణలోని మహాత్మాగాంధీ, బి.ఆర్‌.అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ తదితరుల విగ్రహాలను తొలగించి, పాత భవనం సమీపంలోని లాన్‌లోకి మార్చారు.

Updated : 07 Jun 2024 06:52 IST

దిల్లీ: పార్లమెంటు భవనం సుందరీకరణ చర్యల్లో భాగంగా దాని ఆవరణలోని మహాత్మాగాంధీ, బి.ఆర్‌.అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ తదితరుల విగ్రహాలను తొలగించి, పాత భవనం సమీపంలోని లాన్‌లోకి మార్చారు. దీన్ని కాంగ్రెస్‌ పార్టీ గురువారం తప్పుబట్టింది. పాత పార్లమెంటు భవనం, గ్రంథాలయం నడుమ ఉన్న లాన్‌లోని గిరిజన నేత బిర్సా ముండా, మహారాణా ప్రతాప్‌ తదితరుల విగ్రహాలు యథాస్థానంలో ఉన్నాయి. గాంధీ, అంబేడ్కర్, శివాజీల విగ్రహాల తరలింపును దారుణచర్యగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’ ద్వారా విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్లు భాజపాను ఆదరించనందుకే పార్లమెంటు ఆవరణలోని శివాజీ, అంబేడ్కర్‌ విగ్రహాలను వాటి పూర్వస్థానం నుంచి తరలించారని కాంగ్రెస్‌ ప్రచార విభాగ అధిపతి పవన్‌ ఖేడా మండిపడ్డారు. గుజరాత్‌లోనూ భాజపా క్లీన్‌స్వీప్‌ ఆశలు వమ్ము కావడంతో మహాత్ముని విగ్రహం సైతం తొలగించారన్నారు. ‘‘ఒక్కసారి ఆలోచించండి. వీళ్లకు 400 స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని వదిలేవారా?’’ అని ‘ఎక్స్‌’లో ఖేడా ప్రశ్నించారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, టీఎంసీ ఎంపీ జవాహర్‌ సర్కార్, ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలె కూడా విగ్రహాల తరలింపును ఖండించారు.

సందర్శకుల సౌకర్యం కోసమే 

పార్లమెంటు ఆవరణలోని విగ్రహాల తరలింపుపై విపక్షాల విమర్శల నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ విగ్రహాలు వివిధ చోట్ల ఉండటం వల్ల సందర్శకులు వాటిని సరిగా చూడలేకపోతున్నారని పేర్కొంది. ఈ కారణంగానే వాటిని ‘ప్రేరణా స్థల్‌’లోకి మార్చి, ఆయా నేతల జీవిత చరిత్రలను కూడా తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని