గుజరాత్‌లో లంచాలకూ ఈఎంఐ!

గుజరాత్‌లో లంచగాళ్లు కొత్త మార్గాలు వెదుకుతున్నారు. సొమ్మంతా ఒకేసారి చెల్లించడం బాధితులకు భారంగా మారకుండా కంతులవారీగా (ఈఎంఐల మాదిరి) లంచాలు స్వీకరిస్తున్నారు.

Published : 07 Jun 2024 06:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుజరాత్‌లో లంచగాళ్లు కొత్త మార్గాలు వెదుకుతున్నారు. సొమ్మంతా ఒకేసారి చెల్లించడం బాధితులకు భారంగా మారకుండా కంతులవారీగా (ఈఎంఐల మాదిరి) లంచాలు స్వీకరిస్తున్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ గుజరాత్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీపీ షంషేర్‌సింగ్‌ ఓ ఆంగ్ల మీడియా సంస్థకు వెల్లడించారు. చాలామంది బాధితులు తొలి వాయిదాలు చెల్లించాక  ఏసీబీ వద్దకు వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ దృష్టికి వచ్చిన పలు కేసులను వివరించారు. ఇటీవల ఒక సీఐడీ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ దొంగ సొత్తు స్వాధీనం కేసులో బాధితుడి నుంచి రూ.50 వేలు లంచం డిమాండ్‌ చేశారు. దీనిని కంతులుగా విభజించి నెలకు రూ.10 వేలు కట్టాలని వెసులుబాటు ఇచ్చారు. జూన్‌ నెల మొదటివారం గుజరాత్‌ నీటి సరఫరా విభాగం బోర్డులో ద్వితీయశ్రేణి అధికారి ఓ కాంట్రాక్టరు నుంచి రూ.1.2 లక్షల లంచం అడిగారు. ఈ మొత్తాన్ని నెలకు రూ.30 వేల చొప్పున కంతులుగా చెల్లించాలని సూచించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. గత మార్చిలో ఎస్‌జీఎస్‌టీ బోగస్‌ బిల్లింగ్‌ కుంభకోణంలో అధికారులు నిందితుడి నుంచి రూ.21 లక్షల లంచాన్ని డిమాండ్‌ చేశారు. దీనిని నెలకు రూ.2 లక్షల చొప్పున 10 వాయిదాలు.. చివరి వాయిదాలో రూ.లక్ష ఇవ్వాలని కోరారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 4వ తేదీన సూరత్‌లోని ఒక ఉప సర్పంచి, తాలుకా మెంబర్‌ గ్రామంలోని రైతుల నుంచి రూ.85 వేలు డిమాండ్‌ చేశారు. గ్రామీణుల ఆర్థిక పరిస్థితి చూసి.. ఆ మొత్తాన్ని మూడు ఈఎంఐలుగా చెల్లించాలని కోరారు. మరో కేసులో నలుగురు సైబర్‌ పోలీసులు రూ.10 లక్షల లంచాన్ని నాలుగు ఈఎంఐల్లో అడిగినట్లు ఏసీబీ డీజీపీ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని