ప్రజాస్వామ్య గొప్పతనాన్ని ఈ ఎన్నికలు చాటాయి

ప్రజలు తామేం కోరుకుంటున్నారో శాంతియుతంగా ఓట్ల రూపంలో తెలియజేశారనీ, ప్రజాస్వామ్యంలోని గొప్పతనాన్ని ఇటీవల ఎన్నికలు చాటిచెప్పాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

Published : 08 Jun 2024 06:28 IST

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఆనంద్‌(గుజరాత్‌): ప్రజలు తామేం కోరుకుంటున్నారో శాంతియుతంగా ఓట్ల రూపంలో తెలియజేశారనీ, ప్రజాస్వామ్యంలోని గొప్పతనాన్ని ఇటీవల ఎన్నికలు చాటిచెప్పాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గుజరాత్‌ రాష్ట్రం ఆణంద్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ ఆణంద్‌ (ఐఆర్‌ఎంఏ)లో శుక్రవారం నిర్వహించిన 43వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కోట్ల మంది ప్రజలు తమ ఓటు ద్వారా ఓ సందేశాన్ని ఇచ్చారనీ, రాజకీయ నేతలంతా దాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. జయాపజయాలకు అతీతంగా పార్టీలన్నీ పేదవారి అభ్యున్నతికి పాటుపడాలన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించి, మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో అభ్యర్థి విషయంలో క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కండక్ట్‌ అనే నాలుగు ‘సీ’లు చూసేవారనీ.. ప్రస్తుతం అవి కాస్త క్యాష్, క్యాస్ట్, కమ్యూనిటీ, క్రిమినాలిటీగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో 60 శాతం మందికి వ్యవసాయంతోపాటు సంబంధిత వ్యవస్థలే ఆధారమనీ, ఆయా రంగాల్లో నూతన ఆవిష్కరణలతో ఉత్పాదకత పెంపొందించే దిశగా కృషి చేయాలని విద్యార్థులకు ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉన్నాయనీ, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన బాధ్యత యువతపైనే ఉందన్నారు. సెల్‌ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్‌ పరికరాలను పిల్లలకు అతిగా అలవాటు చేయొద్దనీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఈ)ను సరైన మార్గంలో వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని