ప్రపంచ చరిత్రలోనే.. ‘అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ’

ఎన్నికలు... పౌరులు తమ ఆకాంక్షలను నెరవేర్చే వారికి పట్టం కట్టడానికి ప్రజాస్వామ్య దేశాల్లో అనుసరించే ఉన్నతమైన ప్రక్రియ. ఈ క్రతువులో ఏమాత్రం పారదర్శకత లోపించినా వారి స్వేచ్ఛకు భంగం కలుగుతుంది.

Published : 08 Jun 2024 06:09 IST

 82 రోజుల సుదీర్ఘ ప్రక్రియలో ప్రశాంతంగా ఎన్నికలు 
ప్రపంచమంతా నివ్వెరపోయి వీక్షించిన గొప్ప క్రతువు 
96.88 కోట్ల ఓటర్లతో అలరారుతున్న భారత్‌ 
ఈయూ, ఉత్తర అమెరికా దేశాల ఉమ్మడి జనాభాకంటే అధికం

ఎన్నికలు... పౌరులు తమ ఆకాంక్షలను నెరవేర్చే వారికి పట్టం కట్టడానికి ప్రజాస్వామ్య దేశాల్లో అనుసరించే ఉన్నతమైన ప్రక్రియ. ఈ క్రతువులో ఏమాత్రం పారదర్శకత లోపించినా వారి స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. దేశ ప్రగతికీ అవరోధంగా మారుతుంది. ప్రపంచంలోనే అత్యధికంగా 142 కోట్ల జనాభా, భిన్న భౌగోళిక, వాతావరణ పరిస్థితులున్న భారత్‌లో ఎన్నికలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇక్కడున్న 96.88 కోట్ల ఓటర్ల సంఖ్య... ఐరోపా సమాఖ్య(44.8 కోట్లు), అమెరికా(33.63 కోట్లు), మెక్సికో(12.75 కోట్లు), కెనడా(3.89 కోట్లు)ల ఉమ్మడి జనాభా(95.07 కోట్లు) కన్నా ఎక్కువ. మొత్తంగా భూగోళం పైనున్న 12% జనాభాను ఎన్నికల ప్రక్రియలోకి తీసుకెళ్లడానికి భారత ఎన్నికల సంఘం ఎంతో శ్రమించింది.

అన్ని దేశాలకు మార్గదర్శి...

భారత ఎన్నికల సంఘం 1952 నుంచి 2024 వరకు లోక్‌సభకు 18 సార్లు, దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు 404 సార్లు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల ఎంపిక కోసం 16 సార్లు ఎన్నికలు నిర్వహించింది. ఈసారి నిర్వహించిన ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన మార్చి 16 నుంచి ఫలితాలు ఇవ్వనున్న జూన్‌ 4 వరకు మొత్తం 82 రోజులు పట్టింది. దేశ ఎన్నికల చరిత్రలో ఎక్కువ రోజులు సాగిన రెండో అతిపెద్ద ప్రక్రియ ఇది. అంతకుముందు తొలి సార్వత్రిక ఎన్నికలకు నాలుగు నెలలు పట్టింది. 

ఒక్కరినీ వదిలేయవద్దు 

దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రతి ఓటరుకు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలనే సంకల్పంతో ‘‘ఏ ఒక్క ఓటరునూ వదిలేయవద్దు’’ అనే నినాదంతో ఎన్నికల సంఘం శ్రమించింది. ప్రతి రెండు కి.మీ.లకు ఒక పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసింది. ‘‘మీ వద్దకు మేమే వస్తాం’’ అనే మరో నినాదంతో... హిమాలయ పర్వతసానువుల్లోకి, థార్‌ ఎడారిలోని కుగ్రామాల చెంతకు, ఈశాన్య పర్వత ప్రాంతాల్లోకి, బంగాళాఖాతంలోని అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోకి, దక్షిణ భారతంలోని దట్టమైన అడవుల్లోకి సైతం ఎన్నో ప్రయాసలు పడుతూ ఈవీఎంలను భుజాన వేసుకుని చేరుకున్న సిబ్బంది పోలింగ్‌ నిర్వహించారు. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని తషిగాంగ్‌లో 15,256 అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే అతి ఎత్తయిన ప్రాంతంలోని పోలింగ్‌ స్టేషన్‌కు, ఒకే ఓటరున్న అరుణాచల్‌ప్రదేశ్‌లోని మాలోగాం గ్రామానికి, పులుల అభయారణ్యమున్న గుజరాత్‌లోని గిర్‌ అడవుల్లోకి, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలోని మారుమూల పల్లెకు సైతం వెళ్లారు. ఇందుకు బస్సులు, పడవలు, ఒంటెలు, గుర్రాలు, రైళ్లు, హెలికాప్టర్‌లను వినియోగించారు.


ఇవీ కళ్లు చెదిరే అంకెలు

  • ఎన్నికలు జరిగిన లోక్‌సభ స్థానాలు: 543 (ఒకటి ఏకగ్రీవం)
  • పోటీ చేసిన మొత్తం అభ్యర్థులు: 8,360  
  • ఎన్నికల సంఘం వద్ద నమోదైన ఓటర్లు: 96.88 కోట్లు 
  • వీరిలో మహిళలు 47.10 కోట్లు, పురుషులు 49.70 కోట్లు  
  • తొలిసారి నమోదు చేసుకున్నవారు 1.8 కోట్లు 
  • వీరిలో మహిళలు 85 లక్షలు, పురుషులు 95 లక్షలు
  • 20-29 ఏళ్ల వయసులో ఉన్న ఓటర్లు 19.47 కోట్లు 
  • 85 అంతకంటే ఎక్కువ వయసున్న ఓటర్లు: 82 లక్షలు 
  • వందేళ్లు దాటిన వారు: 2.18 లక్షలు 
  • ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలు: 10.50 లక్షలు 
  • విధుల్లో పాల్గొన్న ఎన్నికల సిబ్బంది, రక్షణ సిబ్బంది: 1.50 కోట్లు 
  • దేశవ్యాప్తంగా నియమించిన ఎన్నికల పరిశీలకులు: 2,100 
  • ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తేదీ: 16-03-24 
  •  పోలింగ్‌ జరిగిన దశలు: 7 
  • తొలిదశ పోలింగ్‌ తేదీ: ఏప్రిల్‌ 19
  • చివరి దశ పోలింగ్‌ తేదీ: జూన్‌ 1 
  • ఎన్నికల ఫలితాలు వచ్చింది: జూన్‌ 4 
  • వాడిన ఈవీఎంల సంఖ్య: 55 లక్షలు 
  • రవాణాకు ఉపయోగించిన వాహనాలు: 4 లక్షలు 
  • ఓటర్లకు సాయపడటానికి, ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి ఈసీ ఉపయోగించిన యాప్‌ల సంఖ్య: 27 
  •  ఓటేసిన వారు: 62.20 కోట్లు 

 ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని