ఉద్యోగంలో చేరే ముందు వీటిని గుర్తుంచుకోండి

నేను తొలిసారిగా ఉద్యోగంలో చేరుతున్నప్పుడు మా నాన్న నాకు 8 విలువైన సలహాలను పేపరుపై రాసి ఇచ్చారు.

Published : 08 Jun 2024 06:13 IST

నేను తొలిసారిగా ఉద్యోగంలో చేరుతున్నప్పుడు మా నాన్న నాకు 8 విలువైన సలహాలను పేపరుపై రాసి ఇచ్చారు. నాకెంతగానో ఉపయోగపడిన ఆ జాబితాను నా పిల్లలు పెద్దయ్యాక వారికి అందించాను. అందులోని అంశాలివీ: 

1.అడిగిన దానికన్నా కనీసం 10 శాతం ఎక్కువ పని చెయ్యి. 

2.ఏ హోదాలో ఉన్నా సీనియర్లతోనూ, జూనియర్లతోనూ మర్యాదగా ప్రవర్తిస్తూ శ్రద్ధాసక్తులతో పని చెయ్యి. 

3.వాస్తవ పరిస్థితులపై అవగాహన ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి భయపడొద్దు. 

4.ఎప్పుడూ ఫిర్యాదు చేయొద్దు. నిర్మాణాత్మకమైన, తీవ్రమైన విమర్శలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. 

5.అవగాహన లేని విషయాలపై నీ అభిప్రాయాలను వాస్తవాలుగా చిత్రీకరించవద్దు. 

6.నీ పనితీరు, ఫలితాలు, ఇతర కీలక అంశాలను గణాంక సహితంగా బేరీజు వేసుకో. 

7.ఏ విషయాన్నైనా నేర్చుకోవడానికి సదా సిద్ధంగా ఉండు. అయితే ప్రతిదాన్ని తార్కికంగా ఆలోచించు. 

8. ఏ విషయంలోనైనా తక్షణమే స్పందించేందుకు సిద్ధంగా ఉండు.

 మార్క్‌ రాండోల్ఫ్, నెట్‌ఫ్లిక్స్‌ సహ వ్యవస్థాపకుడు 


విద్యతోనే బాలికలకు హక్కులపై అవగాహన 

భావి పౌరులకు, ముఖ్యంగా ఆడపిల్లలకు తమ హక్కుల గురించి తెలుసుకొని తమకు జరిగే అన్యాయాలపై పోరాడాలంటే వారికి విద్య, అవగాహన ముఖ్య సాధనాలు. విద్యావంతురాలైన బాలిక తన కోసం, తన తోటివారి కోసం ధైర్యంగా నిలబడగలుగుతుంది. కర్ణాటకలోని రామనగరలో జరిగిన ఉదంతమే అందుకు నిదర్శనం. తమ స్నేహితురాలికి తల్లిదండ్రులు 16 ఏళ్లకే పెళ్లి చేస్తున్న విషయం తెలుసుకున్న బాలికలు ఆ బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి ఒక్కటై మా సంస్థను సంప్రదించారు. వారి సత్వర స్పందనతో స్నేహితురాలిని బాల్య వివాహం నుంచి రక్షించుకున్నారు. బాలికలకు అవగాహన కల్పించడం పాఠశాలల బాధ్యత మాత్రమే కాదు, తల్లిదండ్రులది కూడా. 

 బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ సంస్థ 


ఇతరుల నుంచి స్ఫూర్తి పొందొచ్చు కానీ..

విజేతలు సాధించిన విజయాలను చూసి స్ఫూర్తి పొందొచ్చు. కానీ అదే తరహాలో ఉన్నత స్థాయికి ఎదగడానికి అవసరమైన పట్టుదల, అంకిత భావం మాత్రం మన మనసు నుంచే రావాలి. అప్పుడే మనకు ఎలాంటి సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకెళ్లే ఆత్మస్థైర్యం ఉంటుంది. లేకపోతే ఆ లక్ష్యాన్ని అలా వదిలేసి మరో విజేతను చూసి తాత్కాలిక స్ఫూర్తి పొందడమే పరిపాటిగా మారుతుంది.  

 నావల్‌ రవికాంత్, ఆంత్రప్రెన్యూర్‌


జీ20 దేశాల్లో భారత్‌ విద్యా సంస్థలే ఉత్తమం

గత పదేళ్లలో భారత్‌లో విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల ప్రమాణాలు, ప్రదర్శన నిరంతరం మెరుగుపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ విద్యా సంస్థలకు ర్యాంకులందించే ‘క్యూఎస్‌’ జాబితాలో 2015-2016కు సంబంధించి 11 విద్యా సంస్థలుండగా, 2024-2025 నాటికి వాటి సంఖ్య 318 శాతం పెరుగుదలతో 46కు చేరింది. జీ20 దేశాల్లో ఈ స్థాయి ఉత్తమ  ప్రమాణాలు భారత్‌లోనే నమోదు కావడం విశేషం.

 నుంజియో క్వాక్వరెల్లి, క్యూఎస్‌ సంస్థ సీఈవో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని