అత్యాచారాలు, హత్యలనూ వెనకేసుకొస్తారా..!

తనను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌కు కొందరు మద్దతివ్వడంపై బాలీవుడ్‌ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

Published : 09 Jun 2024 05:14 IST

తనపై దాడి ఘటనను సమర్థిస్తున్న వారిపై కంగనా రనౌత్‌ ఆగ్రహం

దిల్లీ: తనను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌కు కొందరు మద్దతివ్వడంపై బాలీవుడ్‌ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సమర్థించడానికి భావోద్వేగాలే కారణమైతే, అత్యాచారం, హత్యలు చేసేవారికి కూడా ఉద్వేగాలు ఉంటాయని.. మరి అలాంటి నేరస్థులను కూడా వెనకేసుకొస్తారా అని రనౌత్‌ ప్రశ్నించారు. ‘‘ఓ వ్యక్తి అనుమతి లేకుండా శరీరాన్ని తాకడం లేదా దాడి చేయడం సరైందే అని భావిస్తున్నారంటే.. అత్యాచారం లేదా హత్య చేయడాన్నీ సమర్థిస్తున్నట్లే లెక్క. మీరు మీ మానసిక పరిస్థితిపై దృష్టిపెట్టుకోవాలి. యోగా, ధ్యానం చేయండి. లేదంటే జీవితం చేదు అనుభవంగా మారుతుంది. పగ, ద్వేషం, అసూయతో ఉండకండి. వాటినుంచి ఇకనైనా విముక్తి పొందండి’’ అని ‘ఎక్స్‌’ వేదికగా కంగన రాసుకొచ్చారు. గురువారం కంగనాను చండీగఢ్‌ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌కౌర్‌ చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. పంజాబ్‌లో కొన్ని సంస్థలు కౌర్‌ను వెనకేసుకొచ్చాయి. ఆమెకు సంఘీభావం తెలిపాయి. దీంతో కంగన ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రనౌత్‌కు బాలీవుడ్‌ నటి షబానా ఆజ్మీ మద్దతు పలికారు. ‘‘కంగనపై నాకు ప్రేమ లేదు. అయితే ఆమెపై దాడిని సంబరం చేసుకొనేవారిలో నేను చేరదలచుకోలేదు. చట్టాన్ని భద్రతా సిబ్బంది తమ చేతుల్లోకి తీసుకుంటే ఎవరూ సురక్షితంగా ఉండరు’’ అని ‘ఎక్స్‌’ వేదికగా ఆజ్మీ స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని