ఆర్యన్‌ఖాన్‌కు క్లీన్‌చిట్‌

సంచలనం సృష్టించిన క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) శుక్రవారం క్లీన్‌చిట్‌ ఇచ్చింది. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆర్యన్‌తో పాటు మరో ఐదుగురిపై అభియోగాలు మోపలేదని అధికారులు తెలిపారు. ఈ కేసులో మొత్తం 14 మందిపై ముంబయిలోని ఓ కోర్టులో దాదాపు 6 వేల పేజీల అభియోగపత్రం దాఖలు చేసినట్లు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో అన్ని వాస్తవాలను పరిగణనలోకి

Updated : 28 May 2022 06:16 IST

డ్రగ్స్‌ కేసు నుంచి షారుక్‌ తనయుడికి విముక్తి
నేరారోపణకు తగినన్ని సాక్ష్యాధారాలు లేవన్న ఎన్‌సీబీ
సమీర్‌ వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశాలు

ముంబయి, దిల్లీ: సంచలనం సృష్టించిన క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) శుక్రవారం క్లీన్‌చిట్‌ ఇచ్చింది. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆర్యన్‌తో పాటు మరో ఐదుగురిపై అభియోగాలు మోపలేదని అధికారులు తెలిపారు. ఈ కేసులో మొత్తం 14 మందిపై ముంబయిలోని ఓ కోర్టులో దాదాపు 6 వేల పేజీల అభియోగపత్రం దాఖలు చేసినట్లు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో అన్ని వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్నామని, ఆర్యన్‌పై అభియోగాలను నిరూపించగల బలమైన భౌతిక సాక్ష్యాధారాలేవీ ఆయన వాట్సప్‌ చాట్‌ ద్వారా కూడా దొరకలేదని ఎన్‌సీబీ అధిపతి ఎస్‌.ఎన్‌.ప్రధాన్‌ తెలిపారు. ఈ కేసులో షారుక్‌ను ప్రశ్నించారా అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. ‘కొంతమందిని ప్రశ్నించాం. వారి పేర్లను వెల్లడించలేం’ అని మాత్రమే పేర్కొన్నారు. ఆర్యన్‌కు క్లీన్‌చిట్‌ లభించడంపై ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ హర్షం వ్యక్తం చేశారు. సత్యమే విజయం సాధించిందని వ్యాఖ్యానించారు. గత ఏడాది అక్టోబరు 2న కార్డీలియా కంపెనీకి చెందిన క్రూజ్‌ నౌకలో డ్రగ్స్‌ దొరకడంతో అప్పటి ఎన్‌సీబీ ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే నేతృత్వంలో అధికారులు మొత్తం 20 మందిని అరెస్టు చేశారు. వారిలో ఆర్యన్‌ ఒకరు. ఆయన అక్టోబరు 30న బెయిలుపై జైలు నుంచి విడుదలయ్యారు. నవంబరు 6న వాంఖడేను ఈ కేసు దర్యాప్తు నుంచి ఎన్‌సీబీ తప్పించింది. సంస్థలో డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (ఆపరేషన్స్‌)గా పనిచేస్తున్న సంజయ్‌కుమార్‌ సింగ్‌ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్‌) ఆ బాధ్యతను అప్పగించింది.

అధికారుల సోదాల్లో అవకతవకలు

ఆర్యన్‌కు క్లీన్‌చిట్‌ రావడానికి గల కారణాలను ఎన్‌సీబీ వర్గాలు వివరిస్తూ.. ‘‘ఆర్యన్‌ వద్ద డ్రగ్స్‌ దొరకలేదు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలతో ఆయనకు సంబంధాలున్నట్లు కూడా తేలలేదు. మరోవైపు- కార్డీలియా క్రూజ్‌ నౌకపై అధికారుల సోదాల విషయంలో పలు అవకతవకలు కనిపించాయి. అవసరం లేకున్నా ఆర్యన్‌ ఫోన్‌ను వారు తీసుకున్నారు. వేర్వేరు వ్యక్తుల వద్ద మాదకద్రవ్యాలు దొరికినా.. అంతటినీ కలిపి నిబంధనలకు విరుద్ధంగా ఒకే రికవరీగా చూపించారు. అరెస్టు సమయంలో వైద్య పరీక్షలు చేయించలేదు’’ అని పేర్కొన్నాయి.


ఆర్యన్‌ అనుభవించిన క్షోభకు బాధ్యులెవరు?: ఎన్‌సీపీ

ర్యన్‌ నిర్దోషిగా తేలడంపై నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) హర్షం వ్యక్తం చేసింది. అయితే- కేసు నమోదు కావడంతో ఇన్నాళ్లూ షారుక్‌ తనయుడు అనుభవించిన మానసిక క్షోభకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) సర్కారును కూల్చే భారీ కుట్రలో భాగంగానే గతంలో క్రూజ్‌ డ్రగ్స్‌ కేసును నమోదుచేశారని కాంగ్రెస్‌ ఆరోపించింది.

డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌, మరో ఐదుగురికి క్లీన్‌చిట్‌ లభించిన నేపథ్యంలో సమీర్‌ వాంఖడే, ఆయన ప్రైవేటు సైన్యంపై ఎన్‌సీబీ చర్యలు తీసుకుంటుందా, లేదంటే దోషులను కాపాడుతుందా అని మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. నగదు అక్రమ చలామణి కేసులో అరెస్టయిన మాలిక్‌ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయన కార్యాలయం పేరుతో ఉన్న ట్విటర్‌ ఖాతాలో ఈ ట్వీట్‌ కనిపించింది.


వాంఖడేపై చర్యలకు రంగం సిద్ధం

క్రూజ్‌ డ్రగ్స్‌ కేసు దర్యాప్తు ప్రారంభంలో నిర్లిప్తంగా వ్యవహరించినందుకుగాను సమీర్‌ వాంఖడేపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించింది. నకిలీ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారంటూ ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కూడా తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. సమీర్‌ వాంఖడే ఇండియన్‌ రెవెన్యూ సర్వీసు (ఐఆర్‌ఎస్‌) అధికారి. ఎన్‌సీబీ ముంబయి జోనల్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్‌ చేసేందుకే క్రూజ్‌ డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ సహా పలువురిని అరెస్టు చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. వాంఖడే ప్రస్తుతం డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ)లో విధులు నిర్వర్తిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని