కొలీజియం చర్చలు, సంప్రదింపులు రహస్యమే

బహుళ సభ్యుల వ్యవస్థ అయిన కొలీజియంలో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నాక భాగస్వాములందరూ అంగీకరిస్తూ సంతకాలు చేసిన తర్వాతే ఖరారైన అంశాలు సాధికారికంగా వెల్లడవుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Published : 10 Dec 2022 05:24 IST

ఖరారైన తుది నిర్ణయాన్నే వెల్లడిస్తారు : సుప్రీంకోర్టు

స.హ.కార్యకర్త పిటిషన్‌ కొట్టివేత

దిల్లీ: బహుళ సభ్యుల వ్యవస్థ అయిన కొలీజియంలో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నాక భాగస్వాములందరూ అంగీకరిస్తూ సంతకాలు చేసిన తర్వాతే ఖరారైన అంశాలు సాధికారికంగా వెల్లడవుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సాధారణ చర్చకు వచ్చిన విషయాలు, సంప్రదింపుల దశలో ఉన్నవి, తాత్కాలిక నిర్ణయాలను బహిర్గతపరచటానికి వీల్లేదని తెలిపింది. సమాచార హక్కు చట్టం ద్వారా కూడా బయటపెట్టడం సాధ్యంకాదని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. ఈ మేరకు స.హ.కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులను పదోన్నతి ద్వారా సుప్రీంకోర్టుకు తీసుకువచ్చే అంశంపై 2018 డిసెంబరు 12న కొలీజియంలో జరిగిన చర్చలను బహిర్గతపరచాలంటూ పిటిషనర్‌ చేసుకున్న అభ్యర్థనలను తొలుత సమాచార కమిషన్‌, ఆ తర్వాత దిల్లీ హైకోర్టు తోసిపుచ్చాయి. దీనిని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా ఆ అభ్యర్థన తిరస్కరణకు గురైంది. కొలీజియంలో జరిగిన సాధారణ సంప్రదింపుల వివరాలను వెల్లడించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. గతంలో కొలీజియంలో సభ్యులుగా ఉన్న మాజీ న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు, మీడియాలో వచ్చే వార్తలను పరిగణనలోకి తీసుకోలేమని తెలిపింది.


విదేశీ వైద్య విద్యార్థులపై సానుభూతి చూపండి

దిల్లీ: యుద్ధం, కరోనా తదితర సమస్యలతో ఉక్రెయిన్‌, చైనా లాంటి విదేశాల నుంచి భారత్‌ తిరిగి వచ్చి, ఆన్‌లైన్‌లో వైద్య విద్యను పూర్తి చేసిన విద్యార్థుల సమస్యను సానుభూతితో అర్థం చేసుకోవాలని శుక్రవారం సుప్రీంకోర్టు .. కేంద్రాన్ని కోరింది. అవసరమైతే జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ)తో కలిసి వీరి సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించింది. వీరంతా ఆన్‌లైన్‌లో వైద్య విద్యను పూర్తి చేసినా తప్పనిసరి అయిన క్లినికల్‌ శిక్షణను పూర్తి చేయలేకపోయారు. ఇది చేయాలంటే విదేశాల్లో ఉన్న తమ విద్యాలయాలకు వెళ్లాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు. ‘‘పరిష్కారం కనుగొనకపోతే వీరి కెరీర్‌ అస్తవ్యస్తమవుతుంది. కుటుంబాలూ ఇబ్బంది పడతాయి. ఇది నిపుణులు పరిష్కారించాల్సిన సమస్య. అందుకే దీనిపై మేం ఎలాంటి మార్గదర్శకాలనూ జారీ చేయడం లేదు. ఇది దాదాపు 500 మంది విద్యార్థుల సమస్య. వీరు ఏడు సెమిస్టర్లు భౌతికంగా, మూడు సెమిస్టర్లు ఆన్‌లైన్‌లో పూర్తి చేశారు. మానవతా దృక్పథంతో ఈ అంశాన్ని పరిశీలించండి’’ అని కేంద్రాన్ని.. జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం కోరింది.


ఆదివాసీ మహిళలకూ ఆస్తిహక్కు ఉండాలి

అవసరమైతే హిందూ వారసత్వ చట్టానికి సవరణ చేయండి  

దిల్లీ: వీలునామా రాయని కేసుల్లో ఆదివాసీల్లోని పురుషులతో సమానంగా మహిళలకూ వారసత్వపు హక్కులు ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇందుకు ప్రతిబంధకంగా మారిన హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌ 2(2)ను సవరించాలని కేంద్రానికి తెలిపింది. గిరిజనేతర మహిళలకు తండ్రి ఆస్తిలో సమాన వాటా లభిస్తోందని, అదే హక్కును గిరిజన తెగల్లోని మహిళలకు దూరం చేయడం సరికాదని పేర్కొంది. ‘‘సమానత్వ హక్కు కల్పించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా గిరిజన తెగల్లోని కుమార్తెలకు సమాన హక్కు రాలేదు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైంది. అవసరమైతే గిరిజన తెగలకు హిందూ వారసత్వ చట్టం వర్తింపచేయకుండా చేస్తున్న నిబంధనలను సవరించాలి’’ అని శుక్రవారం జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని