Gita Press: ‘అవార్డు రావడం గౌరవప్రదమే.. రూ.కోటి నగదు మాత్రం వద్దు!’

గీతాప్రెస్‌ (Gita Press)కు ‘గాంధీ శాంతి బహుమతి (Gandhi Peace Prize)’ వరించిన విషయం తెలిసిందే. ఈ అవార్డును పొందడం తమకు ఎంతో గౌరవప్రదమని పేర్కొన్న సంస్థ.. దీనికింద ఇచ్చే రూ.కోటి నగదును మాత్రం తిరస్కరించింది.

Published : 19 Jun 2023 17:22 IST

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని గోరఖ్‌పుర్‌కు చెందిన గీతాప్రెస్‌ (Gita Press)కు కేంద్ర ప్రభుత్వం 2021 ‘గాంధీ శాంతి బహుమతి (Gandhi Peace Prize)’ని ప్రకటించిన విషయం తెలిసిందే. అవార్డు కింద రూ.కోటి నగదు, అభినందన పత్రం, జ్ఞాపిక, ప్రత్యేకమైన సంప్రదాయ హస్త కళాకృతులను అందించనుంది. అయితే, గీతాప్రెస్‌ సంస్థ రూ.కోటి నగదును తిరస్కరించినట్లు తెలుస్తోంది.

‘ఈ ప్రతిష్ఠ్మాతక అవార్డుకు ఎంపికవడం చాలా గౌరవప్రదమైన విషయం. అయితే, ఎలాంటి విరాళాలు స్వీకరించకూడదనేది మా సూత్రం. కాబట్టి, నగదు రూపంలో అవార్డు ప్రోత్సాహకాన్ని తీసుకోకూడదని ట్రస్టీ బోర్డు నిర్ణయించింది’ అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆ మొత్తాన్ని వేరే చోట ఖర్చు చేయాలని కేంద్రాన్ని కోరింది. గీతాప్రెస్‌కు ఈ అవార్డు ఇవ్వడంపై వివాదం నెలకొన్న వేళ.. సంస్థ నుంచి ఈ నిర్ణయం వెలువడింది.

గాంధీ నేర్పిన శాంతి బాటన నడుస్తున్న వ్యక్తులు, సంస్థలను గుర్తించి గౌరవించేందుకు 1995లో కేంద్ర ప్రభుత్వం ‘గాంధీ శాంతి బహుమతి’ని ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని అవార్డు ఎంపిక కమిటీ ఆదివారం సమావేశమై ఏకగీవ్రంగా గీతాప్రెస్‌ను ఎంపిక చేసింది. అయితే, కాంగ్రెస్‌ పార్టీ ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది. మరోవైపు భాజపా ఈ విమర్శలను తిప్పికొట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని